
- ఆహ్లాదానికి నోచుకోని మెదక్ జిల్లా ప్రజలు
- సగం పనులు పెండింగ్ పెట్టి బోటింగ్ ప్రారంభించిన మంత్రి
- మరో రూ.10 కోట్లు శాంక్షన్ చేస్తామన్న ప్రకటన
మెదక్, వెలుగు: మెదక్ జిల్లా కేంద్రం ప్రజలు ఆహ్లాదకర వాతావరణానికి నోచుకోవడం లేదు. జాలీగా వాకింగ్, పిల్లలలో గ్రీనరీని ఎంజాయ్ చేద్దామన్న వారి కల నెరవేరడం లేదు. ఆరేళ్ల కింద చేపట్టిన మినీ ట్యాంక్ బండ్ పనులు ముందుకు సాగడం లేదు. కట్ట వెడల్పు, గ్రీనరీ, వ్యూ పాయింట్.. ఇలా పనులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. కానీ, ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బోటింగ్ మాత్రం ప్రారంభించారు. మళ్లీ ఫండ్స్ శాంక్షన్ చేస్తామని, మూడు నెలల్లోనే పనులు కంప్లీట్ చేస్తామని మాటిచ్చారు. అయితే ఆరేళ్లలో కానిపనులు మూడు నెలల్లో కంప్లీట్ అవుతాయా..? అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
70 వేలకు పైగా జనాభా
జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో డెబ్పై వేలకు పైగా జనాభా ఉన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వీళ్లు సేద తీరేందుకు గానీ, వాకింగ్చేసుకునేందుకు గానీ ఎలాంటి పార్క్ లేదు. కనీసం పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన ఎక్విమ్‌మెంట్ కూడా లేదు. చిల్ట్రన్స్ పార్క్ ఉన్నా దాన్నీ భగీరథ ఆఫీస్‌కు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పట్టణ శివారులోని పిట్లం చెరువు, గోసముద్రం చెరువులను కలిపి మినీ ట్యాంక్ బండ్‌గా డెవలప్ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఇరిగేషన్ ఆఫీసర్లు ఎస్టిమేషన్లు తయారు చేసి పంపగా.. మినీ ట్యాంక్ బండ్ కోసం 2016 లో రూ.9.50 కోట్లు మంజూరు అయ్యాయి. టెండర్ ప్రాసెస్పూర్తి చేసి పనులు షురూ చేశారు.
ఎన్నెన్నో చెప్పిన్రు...
పక్కపక్కన ఉన్న పిట్లం చెరువు, గో సముద్రం రెండు చెరువు కలిసి సకల సౌకర్యాలతో మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటనలు ఇచ్చారు. కట్టలు వెడల్పు చేయడంతో పాటు వ్యూ పాయింట్లు, పబ్లిక్ కూర్చునేందుకు బెంచీలు, ఆహ్లాదం కోసం గ్రీనరీ డెవలప్ చేస్తామని చెప్పారు. చెరువుల్లో విహరించేందుకు బోటింగ్ సౌకర్యం అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు చెరువు కట్టల మీద మెదక్ జిల్లా కేంద్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసిన సంఘ సేవకుడు రాందాస్, పేదల భూసమస్యల పరిష్కారం కోసం ఉద్యమించిన కేవల్ కిషన్, స్వతంత్రోద్యమం, తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధుల విగ్రహాలు ప్రతిష్టిస్తామని మాటిచ్చారు.
హడావుడిగా బోటింగ్ ప్రారంభం
మినీ ట్యాంక్ బండ్ పనులు మొదలు పెట్టి ఆరేళ్లైనా పూర్తి కాలేదు. రెండు చెరువుల కట్టల వెడల్పు పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేశారు. కట్టల పటిష్ట పనులు పూర్తికాకపోవడంతో వర్షం పడ్డప్పుడు కయ్యలు ఏర్పడుతున్నాయి. వ్యూ పాయింట్పనులు, బెంచీల ఏర్పాటు, విగ్రహాల ప్రతిష్ట, గ్రీనరీ డెవలప్మెంట్ ఊసేలేకుండా పోయింది. కానీ, గత నెల 26న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గోసముద్రంలో బోటింగ్ ప్రారంభించారు. గోసముంద్రాన్ని మినీ ట్యాంక్ బండ్‌గా డెవలప్ చేసేందుకు రూ.10 కోట్లు మంజూరు చేస్తామని చెప్పి.. మూడు నెలల్లో పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఈ ఫండ్స్‌కు సంబంధించిన ప్రతిపాదనలు కానీ, అంచనాలు గానీ అధికారులు ఇప్పటి వరకు చెప్పడం లేదు. ఆరేళ్ల కింద మంజూరైన నిధుల్లో ఎంత ఖర్చు పెట్టారనే దానిపైనా క్లారిటీ ఇవ్వడం లేదు.
పనులు త్వరగా పూర్తి చేయాలి
మినీ ట్యాంక్ బండ్ పనులు ప్రారంభించి ఆరెళ్లవుతున్నా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. కానీ, మంత్రి హరీశ్ రావు హడావుడిగా బోటింగ్ ప్రారంభించారు. అదికూడా ఎప్పుడు టౌన్ కు ఆనుకుని ఉండే పిట్లం చెరువులో కాకుండా గోసముద్రం చెరువులో బోటింగ్ ఏర్పాటు చేయడం సరికాదు. పనులు త్వరగా పూర్తి చేయాలి. - హర్కార్ మహిపాల్, కన్వీనర్, మెదక్ అభివృద్ధి పోరాట సమితి