గాల్వ‌న్ లోయ‌లో చైనా - భార‌త సైనికుల ఘ‌ర్ష‌ణ: బ‌య‌టికొచ్చిన వీడియో

V6 Velugu Posted on Aug 03, 2021

గ‌త ఏడాది జూన్ 15న‌ ల‌డ‌ఖ్‌లోని గాల్వన్ లోయ‌లో ఇండియా - చైనా ఆర్మీ సైనికుల ఘ‌ర్ష‌ణ జ‌రిగి క‌ల్న‌ల్ సంతోష్ బాబు స‌హా 20 మంది భార‌త జ‌వాన్లు అమ‌రుల‌య్యారు. నాడు రెండు దేశాల సైనికుల మ‌ధ్య తీవ్రంగా కొట్లాట జ‌రిగిందని వార్త‌లు వచ్చాయి. కానీ ఆ రోజు ఏం జ‌రిగింద‌న్న‌ది ఎవ‌రికీ క్లియ‌ర్‌గా తెలియ‌దు. అయితే తాజాగా నాడు జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల‌కు సంబంధించి ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. చైనా సైనికులు ఎత్తులో నిల‌బ‌డి మ‌న ఆర్మీ జ‌వాన్ల‌పై రాళ్లు విస‌ర‌డం, ఎముక‌లు కొరికేసేంతటి మైన‌స్ డిగ్రీలతో అత్యంత‌ చ‌ల్ల‌గా ఉండే గాల్వ‌న్ న‌ది నీటిలో ఇరు దేశాల సైనికుల ఘ‌ర్ష‌ణ, తోపులాటకు సంబంధించిన విజువ‌ల్స్ ఇందులో క‌నిపిస్తున్నాయి. ఆ రోజు ఎంత‌టి తీవ్ర స్థాయిలో ఘ‌ర్ష‌ణ జ‌రిగింద‌నేది ఈ వీడియోలో క‌నిపిస్తోంది. ఇరు దేశాల ఆర్మీ జ‌వాన్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ త‌ర్వాత కొంద‌రు సైనికులు మంచు నీటిలో ప‌డ‌డంతోనే ఎక్కువ మంది మ‌ర‌ణించార‌ని నాడు వచ్చిన వార్త‌ల్లో నిజం ఉంద‌ని దీనిని బ‌ట్టి తెలుస్తుంది. ఆ ఘ‌ట‌న‌లో త‌మ సైనికులు ఎవ‌రూ మ‌ర‌ణించ‌లేద‌ని చైనా నాడు బుకాయించింది. కానీ అది అవాస్త‌వ‌మ‌ని, చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయార‌ని ప‌క్కాగా తేలిపోయింది.

నాడు గాల్వన్‌లో ఘ‌ర్ష‌ణ‌ల‌ ఘ‌ట‌న త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య తీవ్ర‌మైన ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయి. స‌రిహ‌ద్దుల్లో ఇరు వైపులా ఆర్మీ భారీ స్థాయిలో బ‌ల‌గాల‌ను మోహ‌రించే ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే ఆ త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య దౌత్య‌, ఆర్మీ ఉన్న‌తాధికారుల లెవెల్‌లో చ‌ర్చ‌లు జ‌రిగాయి. క్ర‌మంగా ఇరు వైపులా సైన్యాన్ని ఉప‌సంహ‌రిస్తూ పోయేలా అంగీకారానికి వ‌చ్చారు. అయినా కొన్ని సార్లు చ‌ర్చ‌ల్లో సానుకూలంగా స్పందిస్తూ వ‌చ్చినా చైనా అప్పుడ‌ప్పుడు తోక జాడించింది. బ‌ల‌గాల‌ను నో మెన్ జోన్ నుంచి వెన‌క్కి తీసుకుంటున్నామంటూనే కొన్నిసార్లు చ‌ర్చ‌ల్లో జ‌రిగిన ఒప్పందాల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలా 12 రౌండ్ల‌లో మిల‌ట‌రీ లెవెల్ చ‌ర్చ‌లు న‌డిచాయి. జులై 31న జ‌రిగిన ఈ చ‌ర్చ‌ల తర్వాత రెండు దేశాలు క‌లిసి జాయింట్ స్టేట్‌మెంట్ విడుద‌ల చేశాయి. ఉద్రిక్త‌త‌కు ఆస్కారం లేకుండా ఉప‌సంహ‌ర‌ణ‌లు కొన‌సాగిస్తామ‌ని ప్ర‌క‌టించాయి. అయితే స‌రిగ్గా ఈ స‌మ‌యంలోనే ఆగ‌స్టు 2వ తేదీన చైనాకు చెందిన @detresfa అనే ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో గ‌త ఏడాది గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణకు సంబంధించిన 45 సెక‌న్ల వీడియో పోస్ట్ అయింది. ఆ ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన చైనా సైనికుల‌కు చెందిన కుటుంబాన్ని అక్క‌డి ఓ టీవీ చానెల్ చేసిన ఇంట‌ర్వ్యూలో ఈ వీడియో చూపించార‌ని ఆ పోస్ట్‌లో రాసి ఉంది.

 

Tagged China, Indian Army, Unseen video, Galwan Valley clash, surfaces

Latest Videos

Subscribe Now

More News