నాగర్‌కర్నూల్ టౌన్/కందనూలు, వెలుగు: నాగర్‌కర్నూల్ జిల్లాలో కురిసిన అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షం కురవడంతో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన మొక్కజొన్న తడిసిపోయింది. వారం రోజులుగా రైతులు తమ మక్కలను మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి అమ్ముకునేందుకు నిరీక్షిస్తున్నారు. కాంటా అయ్యేంత వరకు సంచుల్లోకి ఎత్తే అవకాశం లేకపోవడంతో యార్డు ఆవరణలో కుప్పలుగా పోసి ఉంచారు.
30 వేల బస్తాల మక్కలు ఆరబెట్టి ఉంచగా, వర్షానికి తడిసిపోయింది. అధికారులు స్పందించి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. అలాగే జిల్లాలోని బిజినేపల్లి, అచ్చంపేట, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. బిజినేపల్లిలో వడగండ్ల వర్షం పడడంతో రైతులు నష్టపోయారు.
పిడుగు పడి మహిళ మృతి
వంగూరు: నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం చాకలి గుడిసెలు గ్రామానికి చెందిన మణెమ్మ(43) పిడుగుపాటుతో చనిపోయింది. తన పొలం నుంచి ఇంటికి వస్తుండగా, పిడుగుపడి చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం గుడిగానిపల్లిలో పిడుగుపాటుతో ఆవు చనిపోయింది.

