145 కిలోమీటర్లు..8 గంటలు.. గర్భిణి నరకయాతన

145 కిలోమీటర్లు..8 గంటలు.. గర్భిణి నరకయాతన
  • ఫిట్స్​రావడంతో  దవాఖానకు వెళ్లేందుకు తిప్పలు 
  • బ్రిడ్జిలు లేక అంబులెన్స్​ రాలేక వేరే దారిలో ఆటోలో పీహెచ్​సీకి..
  • అక్కడ డాక్టర్​లేక మళ్లీ కాగజ్​నగర్​కి..
  • పరిస్థితి విషమించిందని మంచిర్యాలకు..


కాగజ్ నగర్, వెలుగు: ఏడు నెలల గర్భిణి ఫిట్స్ తో విలవిల్లాడింది. దవాఖానకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడింది. ఊరి నుంచి ఉదయం తొమ్మిది గంటలకు ప్రయా ణం మొదలుపెట్టిన ఆమె..మొదట పీహెచ్​సీకి వెళ్లగా డాక్టర్ ​లేడని సమాధానం వచ్చింది. మళ్లీ అక్కడి నుంచి మరో సర్కారు దవాఖానకు వెళ్లగా పరిస్థితి విషమించిందని మెరుగైన వైద్యం కోసం మరోచోటికి వెళ్లమని చెప్పారు. ఫిట్స్​ వస్తూ పోతూ ఉన్నా భరిస్తూ చివరకు సాయంత్రం ఐదు గంటలకు మంచిర్యాల ఏరియా దవాఖానకు చేరుకుంది.

12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీహెచ్ సీకి వెళ్లేందుకు బ్రిడ్జిలు లేని రెండు వాగులు అడ్డుగా ఉండడంతో రెట్టింపు దూరం ఆటోలో అవస్థలు పడుతూ ప్రయాణించాల్సి వచ్చింది. దీంతో పరిస్థితి విషమించగా ఆమెను తీసుకుని రెండు మూడు దవాఖానలకు పరుగులు పెట్టారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు...తర్వాత కూడా వెనకబడిన ప్రాంతంగానే ఉన్న కాగజ్​నగర్​ ప్రాంతంలోని బెజ్జూర్ ​మండలానికి చెందిన ఓ మహిళ కన్నీటి కథనం ఇది. 

12 కిలోమీటర్లకు..24 కిలోమీటర్లు 

ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని ఇప్పలగూడకు చెందిన ఆత్రం రోజా ఏడు నెలల గర్భిణి. ఈమెకు గురువారం ఉదయం ఫిట్స్ వచ్చాయి. దీంతో భర్త సుభాష్​, కుటుంబీకులు హాస్పిటల్ తీసుకువెళ్లడానికి రెడీ అయ్యారు. అయితే, సూస్మీర్, కుష్నపల్లి వాగులు ఉప్పొంగుతుండడం, వాటిపై బ్రిడ్జిలు లేకపోవడంతో 12 కిలోమీటర్ల దూరంలోని బెజ్జూర్​పీహెచ్ సీకి తీసుకెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. 

అంబులెన్స్ వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో ఎంపీటీసీ ఆత్రం సాయి, కుటుంబీకులు రోజాను ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆటోలో తలాయి, పాపన్​పేట్​రూట్​లో బెజ్జూర్​కు తరలించారు. ఈ దారిలో వెళ్తే 24 కిలోమీటర్లవుతుందని తెలిసినా బయలుదేరక తప్పలేదు. ఈ మధ్యలో ఆమెకు ఫిట్స్​వస్తూ పోతున్నా దేవుడిపై భారం వేసి వెళ్లారు. అంతకుముందే 108కి ఫోన్​చేయగా తిక్కపల్లి సమీపంలోకి రాగానే అంబులెన్స్ వచ్చింది. 

దీంతో అక్కడే ప్రథమ చికిత్స చేసి మళ్లీ బెజ్జూర్​పీహెచ్ సీకి తరలించారు. పదకొండున్నర గంటలకు పీహెచ్​సీకి వెళ్లగా డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుంచి కాగజ్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కు ప్రయాణం మొదలుపెట్టారు. అక్కడికి వెళ్లే సరికి మధ్యాహ్నం రెండు గంటలయ్యింది. కానీ, డాక్టర్లు పరిస్థితి విషమించిందని మంచిర్యాలకు తీసుకువెళ్లాలని సలహా ఇచ్చారు. మళ్లీ అక్కడి నుంచి మంచిర్యాల ఏరియా దవాఖానకు వెళ్లేసరికి సాయంత్రం ఐదు గంటలయ్యింది.

మొత్తంగా ఓ ఏడు నెలల గర్భిణి ఫిట్స్ కు వైద్యం కోసం 145 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి ఎనిమిది గంటల పాటు ప్రయాణించాల్సి వచ్చింది.