బీజేపీ ఎలక్షన్ వార్ రూమ్కు యూపీ ఇన్​చార్జ్లు

బీజేపీ ఎలక్షన్ వార్ రూమ్కు యూపీ ఇన్​చార్జ్లు

రాష్ట్రానికి రానున్న ఇద్దరు స్ట్రాటజిస్టులు  
వీరిలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాం, ఫడ్నవీస్ అడ్వయిజర్ శ్వేత శాలిని 
ఇప్పటికే పార్టీ రాష్ట్ర ఎలక్షన్ కో ఇన్​చార్జ్​గా ఉన్నసునీల్ బన్సల్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడంపై ఆ పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలను రచించడం కోసం పార్టీ పరంగా సొంత బలగం ఏర్పాటుపై ఢిల్లీ పెద్దలు కసరత్తు పూర్తి చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో త్వరలో ఏర్పాటు చేయనున్న “ఎలక్షన్ వార్ రూమ్”కు కొత్తగా ఇద్దరు స్ట్రాటజిస్టులను పార్టీ హైకమాండ్ పంపించనుంది. వీరిలో ఒకరు యూపీలో బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాం కాగా.. మరొకరు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చీఫ్ అడ్వయిజర్ శ్వేతశాలిని ఉన్నారు. యూపీలో బీజేపీకి ఇన్​చార్జీగా ఉండి, అక్కడ యోగి ఆదిత్యనాథ్ రెండోసారి సీఎంగా ఎన్నిక కావడంలో కీలక పాత్ర పోషించిన సునీల్ బన్సల్ ఇప్పటికే ఇక్కడ పార్టీకి ఎన్నికల కో ఇన్​చార్జ్​గా ఉన్నారు. ఇప్పుడు ఆయనతో పాటు జాఫర్ ఇస్లాం, శ్వేతశాలిని అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం పనిచేయనున్నారు. 

ముస్లింల మద్దతుకు జాఫర్ కీలకం 
మీడియా, సోషల్ మీడియాలో బీజేపీదేపై చేయిగా నిలపడంతో పాటు రాజకీయ ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పార్టీ విజయానికి బాటలు వేసేందుకు.. ఈ ఇద్దరు స్ట్రాటజిస్టులు త్వరలో పార్టీ స్టేట్ ఆఫీసులో ఏర్పాటుకానున్న ఎలక్షన్ వార్ రూమ్​ బాధ్యతలు చేపట్టనున్నారు. వాస్తవానికి జార్ఖండ్​కు చెందిన జాఫర్ ఇస్లాం యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. యూపీలో ముస్లిం ఓటర్లను బీజేపీ వైపు మళ్లించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయన్ను యూపీ కోటాలో రాజ్యసభకు నామినేట్ చేశారు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో మజ్లిస్ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు, ఇక్కడి ముస్లింలను బీజేపీ వైపు తిప్పుకోవడంలో కూడా జాఫర్ తన వంతు పాత్రను పోషించనున్నారని హైకమాండ్ నమ్ముతున్నది. అందుకే అతన్ని ఇక్కడకు పంపించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జాఫర్ వ్యూహాలు అనుకున్న రీతిలో అమలైతే గ్రేటర్ పరిధిలో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందనేది హైకమాండ్ భావన. తాజాగా యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ) విషయంలోనూ ఇక్కడి ముస్లింలకు జాఫర్ ఇస్లాం వివరించి వారి మద్దతు కూడగట్టనున్నారని హైకమాండ్ విశ్వసిస్తున్నది.  

ఎన్నికల కోసం 22 కమిటీలు  
రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం బీజేపీ రాష్ట్ర పార్టీ ఏకంగా 22 కమిటీలను ఎన్నికల కోసం వినియోగించుకోనుంది. వీటిలో ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ, స్ట్రాటజీ కమిటీ, మీడియా, సోషల్ మీడియా, ప్రచార, మేనిఫెస్టో, చార్జీషీట్, పబ్లిక్ మీటింగ్, ట్రాన్స్ పోర్టు కమిటీల వంటివి ఉన్నాయి. కమిటీలకు రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలను చైర్మన్​లుగా నియమించనున్నారు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ పార్టీ కోసం పూర్తి సమయం కేటాయించేవారిని సభ్యులుగా తీసుకోనున్నారు. కమిటీలపై ఇప్పటికే కసరత్తు పూర్తయింది. ఒకటి, రెండు రోజుల్లో వీటిని ప్రకటించనున్నారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా ఇప్పటికే ఈటల రాజేందర్​ను పార్టీ నియమించింది. ఈ కమిటీలోని మిగతా సభ్యులను కూడా ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. ఇక సోషల్ మీడియా కమిటీకి పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్​ను ఇన్​చార్జిగా, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డిని కో ఇన్​చార్జిగా నియమించనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ALSO READ :వాల్మీకి, బోయ, వడ్డెర కులాలను ఎస్టీల్లో చేర్చాలి: ఎంపీ లక్ష్మణ్

మహిళా నేతలకు శాలిని దిశానిర్దేశం 
పార్టీ మరో స్ట్రాటజిస్టు శ్వేతా శాలిని ప్రస్తుతం ఫడ్నవీస్​కు చీఫ్ అడ్వయిజర్ గా వ్యవహరిస్తు న్నారు. 2013–14 గుజరాత్ ఎన్నికల టైమ్​లో మోదీకి కూడా ఆమె వ్యూహకర్తగా పని చేశారు. అయోధ్యకు చెందిన ఆమె 2011 వరకు సక్సెస్ ఫుల్ ఎంట్రపెన్యూర్​గా గుర్తింపు పొందారు. మహారాష్ట్రలో విలేజ్ సోషల్ ట్రాన్స్ ఫార్మేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలను బీజేపీ వైపు తిప్పుకునేందుకు ఈమె వ్యూహాలు కీలకం కానున్నాయని భావిస్తున్నారు. కేసీఆర్ పాలనలో మహిళలపై జరుగుతున్న​అఘాయిత్యాలపై ఇక్కడి మహిళా మోర్చా నేతలు చేపట్టనున్న ఉద్యమానికి శ్వేతా శాలిని దిశానిర్దేశం చేయనున్నారు.