వీడో సైకో : ఫైనల్ మ్యాచ్ సమయంలో టీవీ ఆఫ్ చేసిన కొడుకు.. చార్జింగ్ వైరుతో చంపేసిన తండ్రి

వీడో సైకో : ఫైనల్ మ్యాచ్ సమయంలో టీవీ ఆఫ్ చేసిన కొడుకు.. చార్జింగ్ వైరుతో చంపేసిన తండ్రి

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వరల్డ్ కప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓడిపోయింది. 12 ఏళ్ళ తర్వాత భారత్ వరల్డ్ కప్ ఫైనల్ కు రావడం.. సొంత గడ్డపై మ్యాచ్ కావడంతో దేశమంతా క్రికెట్ ఫీవర్ తో ఊగిపోయింది. భారత్ ఈ మ్యాచ్ ఓడిపోవడంతో కొంతమంది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమందైతే గుండె పోటుతో మరణించారు. అయితే ఫైనల్ మ్యాచ్ చూస్తున్నప్పుడు టీవీ కట్టేసాడని కన్న కొడుకును చంపేశాడు ఒక కసాయి తండ్రి.
       
ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌లో గణేష్ ప్రసాద్ మ్యాచ్ చూస్తున్నప్పుడు అతని కుమారుడు దీపక్ ముందుగా రాత్రి భోజనం వండమని కోరాడు. అయితే తండ్రి తన కొడుకు చెప్పిన మాట లెక్క చేయకపోవడంతో దీపక్ టీవీని ఆఫ్  చేసాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ కాస్తా పెద్దదిగా మారడంతో మద్యం మత్తులో ఉన్న గణేష్ తన కుమారుడిని మొబైల్ ఛార్జర్‌తో గొంతుకోసి చంపాడని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి పరారైన అతడిని సోమవారం కాన్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

మృతదేహాన్ని మెట్లపై పడి ఉన్న బంధువు గుర్తించాడు. క్రికెట్ మ్యాచ్ చూసే విషయంలో జరిగిన గొడవలే హత్యకు తక్షణ కారణమని పోలీసులు తెలిపారు. హత్యకు మొబైల్ ఛార్జింగ్ కేబుల్ ఉపయోగించినట్లు చకేరి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) బ్రిజ్ నారాయణ్ సింగ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.తండ్రీకొడుకులు తరచూ తాగి వచ్చి గొడవపడేవారని పోలీసులు తెలిపారు. గత వారం దీపక్ కొట్టడంతో తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయింది.