మాస్క్ పెట్టుకోలేదని కస్టమర్ పై సెక్యూరిటీ గార్డు కాల్పులు

మాస్క్ పెట్టుకోలేదని కస్టమర్ పై సెక్యూరిటీ గార్డు కాల్పులు

కరోనావైరస్ వ్యాప్తితో దేశమంతా మాస్క్ తప్పనిసరైంది. ఎక్కడికి వెళ్లినా మాస్క్ లేనిదే నో ఎంట్రీ అనే బోర్డు దర్శనమిస్తోంది. అయితే మాస్క్ పెట్టుకోలేదని ఓ సెక్యూరిటీ గార్డ్.. బ్యాంకుకు వచ్చిన కస్టమర్ మీద కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగింది.

స్థానికంగా నివసించే రాజేష్ కుమార్ రైల్వే ఉద్యోగి. ఆయన తన భార్యతో కలిసి బ్యాంకుకు వెళ్లాడు. అయితే ఆ సమయంలో రాజేష్.. మాస్క్ ధరించలేదు. దాంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు.. మాస్క్ లేనిదే లోపలికి వెళ్లకూడదని చెప్పాడు. వెంటనే రాజేష్.. బ్యాంకు నుంచి బయటకు వెళ్లి సమీపంలోని షాపులో మాస్క్ కొనుగోలు చేసి పెట్టుకొని వచ్చాడు. అయినా కూడా సెక్యూరిటీ గార్డు.. రాజేష్‌ను బ్యాంకు లోపలికి అనుమతించలేదు. లంచ్ సమయం అయిందని చెప్పి.. తర్వాత రావాలని చెప్పాడు. అంతకుముందే మాస్క్ గురించి ఇద్దరి మధ్యా వాదన జరిగింది. ఆ తర్వాత బ్యాంకు లోపలి వెళ్లడం గురించి వాదన జరిగింది. దాంతో ఇద్దరి మధ్యా తోపులాట జరిగింది. కోపోద్రిక్తుడైన గార్డు.. రాజేష్ మీద కాల్పులు జరిపాడు. దాంతో బుల్లెట్ రాజేష్ కాలుకు తగిలి అక్కడే కుప్పకూలాడు. మాస్క్ పెట్టుకోకపోగా.. తన మీద దుర్భాషలాడడని.. అందుకే అనుకోకుండా కాల్పులు జరపాల్సి వచ్చిందని గార్డు పోలీసులకు తెలిపాడు. బాధితుడు రాజేష్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. గార్డును అదుపులోకి తీసుకున్నారు. బుల్లెట్ రాజేష్ కాలుకు తగలడంతో ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.