పార్టీ చీఫ్ ఓటేయకుండా ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

పార్టీ చీఫ్ ఓటేయకుండా ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?
  • యూపీ తొలి దశ పోలింగ్ లో ఓటు వేయని ఆర్ఎల్డీ పార్టీ చీఫ్ ను తప్పుబట్టిన బీజేపీ

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రోజు తొలి దశ పోలింగ్ జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించింది ఈసీ. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనున్న యూపీలో ఇవాళ తొలి విడతలో భాగంగా 11 జిల్లాల్లో 58 నియోజకవర్గాల్లో ప్రజలు ఓట్లు వేశారు. సాయంత్రం ఆరు గంటల వరకు 58.77 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసీ వెల్లడించింది. అయితే ఒక ప్రముఖ పార్టీ నేత తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. అధికార బీజేపీకి ప్రధాన పోటీదారుగా ఉన్న సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న జాట్ నేత, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) చీఫ్ జయంత్ సింగ్ చౌదరి పోలింగ్ సమయం ముగిసే లోపు బూత్ వద్దకు చేరుకోలేకపోయారు. మధుర నియోజకవర్గంలో ఓటు ఉన్న ఆయన తన ఓటు వేయలేకపోయారు. 

ప్రచారంలో బిజీ.. వస్తానని చెప్పి చివరికి..

యూపీలో రెండో దశ పోలింగ్ జరగబోయే నియోజకవర్గాల్లో ప్రచారానికి రెండ్రోజులు మాత్రమే సమయం ఉండడంతో జయంత్ చౌదరి క్యాంపెయినింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. గురువారం ఉదయం ఆయన బిజ్నోర్ ప్రాంతంలో ఎన్నికల సభల్లో పాల్గొని ప్రచారం చేశారు. అయితే ఆ సమయంలో మీడియాతో మాట్లాడిన ఆయన పోలింగ్ కు సాయంత్రం ఆరు గంటల వరకు సమయం పోలింగ్ సమయం ఉందని, ప్రచారం ముగించుకున్న తర్వాత మధురకు వెళ్లి ఓటు వేస్తానని తెలిపారు. కానీ ప్రచారం పూర్తి చేసుకుని ఆయన ఓటింగ్ సమయం ముగిసేలోపు మధురకు చేరుకోలేక తన విలువైన ఓటును వేయలేకపోయారు. అయితే తన భార్య మాత్రం ఉదయమే ఓటు వేసిందని జయంత్ సింగ్ చౌదరి చెప్పారు.

ప్రజాస్వామ్యంపై గౌరవమిదేనా?

ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి తన ఓటు వేయకపోవడాన్ని పలువురు బీజేపీ నేతలు తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ప్రతి ఒక్కరి హక్కు అని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ఆ ఓటు హక్కును వినియోగించుకోకపోవడమంటే ప్రజాస్వామ్యం ఇచ్చిన శక్తిపై గౌరవం లేదని అర్థమన్నారు. ఎన్నికల ప్రచారం కోసం జయంత్ చౌదరి తన ఓటు హక్కు వినియోగించుకోకపోవడం అంటే ఆయన బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందని బీజేపీ ఐటీ సెల్ ఇన్ చార్జ్ అన్నారు. ఆయన ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్లని ప్రశ్నించారు. తన ఓటు వినియోగించుకోవడం పైనే సీరియస్ నెస్ లేని ఆర్ఎల్డీని ప్రజలు ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

కర్ణాటకలో కాలేజీలు తెరవచ్చన్న హైకోర్టు.. కానీ కండిషన్స్ అప్లై

నలుగురు రైతుల్ని చంపినోడికి నాలుగు నెలల్లో బెయిలా?

పదేళ్లుగా సర్కారుకు కిరాయి కట్టని కాంగ్రెస్