కోటీశ్వరులే కదా.. జీతాలు ఇవ్వలేదా : నోయిడా సొసైటీకి తాళాలు వేసిన సెక్యూరిటీ గార్డులు

కోటీశ్వరులే కదా.. జీతాలు ఇవ్వలేదా : నోయిడా సొసైటీకి తాళాలు వేసిన సెక్యూరిటీ గార్డులు

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఒక సొసైటీకి చెందిన సెక్యూరిటీ గార్డులు సమ్మె చేసి సొసైటీ ప్రధాన గేటుకు తాళం వేశారు. గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని మహాగున్ మేవుడ్స్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. సెక్యూరిటీ గార్డులు సమ్మెకు పిలుపునిచ్చి సొసైటీ మెయిన్ గేట్‌కు తాళం వేయడంతో అక్కడ నివసించే వారు సొసైటీ నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డులు సొసైటీ వెలుపల నిరసన వ్యక్తం చేసి ప్రధాన గేటు వద్ద కూర్చున్నారు.

రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో సెక్యూరిటీ గార్డులు సమ్మెకు దిగినట్లు సమాచారం. జీతాలు ఇవ్వకపోవడంతో సొసైటీ ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. దీంతో సొసైటీలోని ప్రజలు ఆఫీసుకు, పిల్లలు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నిరసనలకు సంబంధించిన ఏ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళలతో సహా దాదాపు 40-50 మంది సెక్యూరిటీ గార్డులు సొసైటీ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలుపుతున్నట్లు ఈ వీడియోలో చూడవచ్చు. తమకు రావాల్సిన జీతాలు చెల్లించాలని, లేకుంటే సొసైటీ ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసనలు తెలుపుతామన్నారు.

ఈ సెక్యూరిటీ గార్డులు ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పనిచేస్తున్నారు. ఆ సంస్థ ఉద్యోగి తమకు జీతాలు ఇస్తామని సెక్యూరిటీ గార్డులను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మరో వీడియోలో చూడవచ్చు. కానీ వారు అతని మాట వినడానికి సిద్దంగా లేనట్టు కనిపించింది. తమ నిరసనను కొనసాగించడానికే సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది.