లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఓటర్ లిస్ట్ ముసాయిదాను ఎన్నికల సంఘం మంగళవారం (జనవరి 6) రిలీజ్ చేసింది. 2.89 కోట్లకు పైగా ఓట్లను తొలగించింది ఈసీ. సవరణ తర్వాత తుది జాబితాలో 12.55 కోట్ల మంది పేర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు అధికారులు. సర్‌కు ముందు 15.44 కోట్ల పేర్లు ఓటర్ జాబితాలో ఉండేవి. అంటే దాదాపు 2.89 కోట్లకు పైగా ఓట్లను తొలగించింది ఈసీ.
పేర్లు తొలగించిన ఓటర్లలో 46.23 లక్షల మంది మరణించగా.. 2.17 కోట్ల మందిని వివిధ కారణాలతో తొలగించారు. మరో 25.47 లక్షల మందికి నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నట్లు గుర్తించిన ఈసీ ఈ ఓట్లను కూడా తొలగించింది. అభ్యంతరాల స్వీకరణకు 2026, ఫిబ్రవరి 6 వరకు గడువు ఇచ్చింది ఈసీ. ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేని వ్యక్తులు ఈ తేదీ లోగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో లేదా సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)ని కలిసి అభ్యంతరాలను సమర్పించవచ్చని తెలిపింది.
Also Read : BMC ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా ?
ఈ సందర్భంగా యూపీ ఎన్నికల ప్రధానాధికారి రిన్వాస్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 15,000కి పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా కాపీలను రాజకీయ పార్టీలకు అందించామని చెప్పారు. ముసాయిదా జాబితాలో పేర్లను లేని వారి ఎన్నికల సంఘం లేదా బీఎల్వోలను సంప్రదించి అభ్యంతరాలు సమర్పింవచ్చని తెలిపారు. అభ్యంతరాల స్వీకరణకు 2026, ఫిబ్రవరి 6 వరకు గడువు ఉందని తెలిపారు. 2026, మార్చి 6న ఓటరు తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ఓటర్లు వెబ్‌సైట్‌లో వారి EPIC నంబర్‌ను నమోదు చేసి వివరాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు.
