పబ్జీ ఆడనివ్వలేదని ప్రాణం తీసిండు

పబ్జీ ఆడనివ్వలేదని ప్రాణం తీసిండు

లక్నో: ఆన్లైన్ గేమ్ పబ్జీ ఓ టీనేజర్ను హంతకున్ని చేసింది. గేమ్ ఆడనివ్వలేదన్న కోపంలో తల్లి ప్రాణాలు తీసేందుకు కారణమైంది. ఉత్తర్ప్రదేశ్ లక్నోలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. 

లక్నోకు చెందిన 16 ఏళ్ల బాలుడు పబ్ జీ గేమ్ కు అడిక్ట్ అయ్యాడు. తిండి, నిద్ర మాని గేమ్ ఆడుతుండటంతో తల్లి పలుమార్లు మందలించింది. అయినా తీరు మార్చుకోని బాలుడు ఆదివారం తెల్లవారు జాము వరకు నిద్రపోకుండా గేమ్ ఆడుతూనే ఉన్నాడు. అది గమనించిన తల్లి మరోసారి మందలించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాలుడు తండ్రి లైసెన్స్డ్ రివాల్వర్తో ఆమెపై కాల్పులు జరిపాడు. తలలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆమె స్పాట్లోనే ప్రాణాలు వదిలింది. 

తల్లిని హత్య చేసిన అనంతరం సదరు బాలుడు ఆమె శవాన్ని ఇంట్లోనే దాచిపెట్టాడు. తొమ్మిదేళ్ల చెల్లెలితో కలిసి మూడు రోజులు ఇంట్లోనే ఉన్నాడు. మృతదేహం నుంచి వాసన రాకుండా రూం ఫ్రెషనర్ ఉపయోగించారు. విషయం ఎవరికైనా చెబితే తనను కూడా చంపేస్తానని చెల్లిలిని కూడా బెదిరించాడు. ఆర్మీలో పనిచేస్తున్న బాలుడి తండ్రి ప్రస్తుతం బెంగాల్లో విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో రెండు రోజుల వరకు విషయం బయటకు రాలేదు. భార్య ఫోన్లో మాట్లాడకపోవడంతో భర్తకు అనుమానం కలిగింది. కొడుకును విషయం అడగడంతో బాలుడు ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన ఓ ఎలక్ట్రీషియన్ తల్లిని కాల్చి చంపాడని కట్టుకథ వినిపించాడు. పోలీసులకు సైతం ఇదే విషయం చెప్పాడు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడటంతో బాలున్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు ప్రకటించారు.