
- ఎస్పీకి 37, కాంగ్రెస్ కు 6 సీట్లు
- మ్యాజిక్ మార్కు రాకుండా దెబ్బకొట్టిన రాహుల్, అఖిలేష్
- అయోధ్య సెగ్మెంట్ ఉన్న ఫైజాబాద్ లోనూ కమలం ఓటమి
న్యూఢిల్లీ, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఉత్తర ప్రదేశ్ ఫలితాలు ధమ్కీ ఇచ్చాయి. ఈసారి ఎన్డీఏకు ‘చార్ సౌ పార్’ (400 సీట్లుపైనే) లో భాగంగా యూపీలో భారీగా సీట్లు గెలుస్తామనుకున్న బీజేపీ 33 స్థానాల్లోనే విజయం సాధించింది. గత ఎన్నికల్లో మొత్తం 80 సీట్లలో ఏకంగా 62 చోట్ల గెలిచిన బీజేపీ ఈసారి 29 స్థానాలను కోల్పోయింది. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) కి 37, కాంగ్రెస్ కు 6 సీట్లు వచ్చాయి.
గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా యూపీలో కమలం పార్టీ హవా కొనసాగుతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. తాము ‘యూపీ కుర్రాళ్లం (యూపీ కే లడ్కే)’ అని చెప్పుకుంటూ ప్రచారం చేసిన ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఈ ఎన్నికల్లో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ కు గట్టి దెబ్బ తగిలేలా చేశారు. యూపీలో బీజేపీ మెజార్టీ స్థానాలు సాధించకుండా అడ్డుకోవడం ద్వారా కేంద్రంలో ఆ పార్టీ సొంతంగా సర్కారు ఏర్పాటు చేయకుండా మిగతా పార్టీల మీద ఆధారపడేలా చేశారు.
మరోవైపు బీఎస్పీ ఒంటరిగా బరిలోకి దిగడంతో ఆ పార్టీ ఓట్లు సైతం ఎస్పీ, కాంగ్రెస్ కూటమికి మళ్లాయి. దీంతో రాష్ట్రంలో బీజేపీ కేవలం 33 సీట్లకే పరిమితమైపోయింది. ఎస్పీ 37, కాంగ్రెస్ 6 సీట్లను కైవసం చేసుకున్నాయి. రెండూ కలిపి రాష్ట్రంలో సగానికి పైగా(43) సీట్లను సొంతం చేసుకున్నాయి. బీజేపీ మిత్రపక్షాల్లోని ఆర్ఎల్డీ 2 సీట్లు, అప్నాదళ్(సోనేలాల్) పార్టీ ఒక సీటును గెలుచుకున్నాయి. మిగిలిన సీటును ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) దక్కించుకుంది. బీఎస్పీకి కనీసం ఒక్క సీటు కూడా దక్కలేదు. కాగా.. 2014 ఎన్నికల్లో యూపీలో 80 స్థానాలకు 71 సీట్లను బీజేపీ గెలుచుకుంది.
మోదీకి చెమటలు పట్టించిన అజయ్
1991 నుంచి బీజేపికి తొమ్మిది సార్లు విజయాన్ని అందించిన కాషాయ కోట అయిన వారణాసి నుంచే ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గానికి చివరి ఫేజ్ లో ఎన్నికలు జరగగా.. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు ఇక్కడ ప్రచారం చేశారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలోని చంద్ర బాబుతో పాటు, పలువురు ప్రముఖులు ఇక్కడ దిగారు. అయితే.. ఎన్నికల ఫలితాల వేళ మోదీకి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ చెమలు పట్టించారు. తొలి రెండు రౌండ్లలో దాదాపు 6 వేల మెజారిటీతో అజయ్.. లీడ్ లో ఉన్నారు. దీంతో మోదీ గెలుపుపై పార్టీలో కొంత చర్చ మొదలైంది. చివరకు మోదీ గెలుపు ఖాయమైనా.. మెజారిటీ మాత్రం గత ఎన్నికలతో పోలిస్తే సగానికి పైగా తగ్గింది.
కూటమికి కలిసొచ్చిన ‘యూపీ కే లడ్కే’ ప్రచారం
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న సామెతను రాహుల్- గాంధీ, అఖిలేష్ యాదవ్ సరిగా వంట బట్టించుకున్నారు. 2017కు ముందు వీరి ద్వయం కలిసి ప్రచారం చేసింది. అయితే 2019 లో యూపీలో బీజేపీ 62 స్థానాలను గెలుచుకుంది. ఈసారి ఆ ఇద్దరు నేతలు చేపట్టిన‘యూపీ కే లడ్కే’ ప్రచారం బాగా సక్సెస్ అయింది. బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తే రాజ్యాంగం మార్చేస్తారని, రిజర్వేషన్లను రద్దుచేస్తారని వారు ప్రచారం చేశారు. అలాగే అగ్నిపథ్ స్కీం ఫెయిల్యూర్, ఉద్యోగాల భర్తీపై ఓటర్లకు వివరించడంలో సక్సెస్ అయ్యారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి స్వతంత్రంగా బరిలోకి దిగారు. ఆ పార్టీ షేర్ ఓట్లు కూడా కూటమికి మళ్లడంతో యూపీలో కాంగ్రెస్– ఎస్పీ కూటమికి 43 సీట్లు వచ్చాయి.
ఫైజాబాద్ లోనూ పరాభవం
అయోధ్య రామజన్మభూమి ఉన్న ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో సైతం బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్.. ఎస్పీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ చేతిలో 54,567 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మరోవైపు ఫైజాబాద్ స్థానానికి చుట్టుపక్కల 7 లోక్ సభ స్థానాలు ఉండగా, వాటిలో 2 (గోండా, కైసర్ గంజ్) స్థానాల్లోనే బీజేపీ గెలిచింది. అమేథీ, బారాబంకీలో కాంగ్రెస్ విజయం సాధించగా.. సుల్తాన్ పూర్, అంబేద్కర్ నగర్, బస్తి నియోజకవర్గాల్లో ఎస్పీ అభ్యర్థులు గెలుపొందారు.
బీఎస్పీ ఓట్లు ఎస్పీ–కాంగ్రెస్ కూటమికి
మాజీ సీఎం మాయావతి ఆధ్వర్యంలోని బీఎస్పీ ఈ లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 2014 ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఖాతా తెరవలేదు. కానీ, 2019లో అనూహ్యంగా 10 సీట్లను గెలుచుకుంది. అప్పుడు ఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో ఎన్నికల్లో తన ఉనికిని చాటుకుంది. ఈసారి కాంగ్రెస్ తో ఎస్పీ పొత్తు పెట్టుకోవడంతో ఒంటరిగానే బరిలోకి దిగిన బీఎస్పీ మళ్లీ కనుమరుగు అయిపోయింది. ఆ పార్టీ ఓట్లు ఎస్పీ–కాంగ్రెస్ కూటమికి బదిలీ అయ్యాయి.
ప్రభావం చూపని రామ మందిర ప్రచారం
ఈసారి రామ మందిర నిర్మాణంతో ఓట్లు దండుకుందామని బీజేపీ వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. ఈ విషయంలో 1993 సీన్ రిపీట్ అయింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత 1993 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రబలమైన ‘రామ్’ వేవ్ స్పష్టంగా కనిపించింది. రాష్ట్రమంతటా మతపరమైన సెంటిమెంట్ నెలకొనడంతో బీజేపీ విజయం ఖాయమని అందరూ భావించారు. అయితే.. అనూహ్యంగా ఆ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేయడంతో బీజేపీ ఓడింది. 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ రామ మందిరం నినాదాన్ని బీజేపీ ప్రధాన అజెండాగా పెట్టుకుంది. ఈ ఏడాది జనవరి 22న రామ మందిర ప్రతిష్టాపన, తర్వాత సూర్య తిలకం, రాముడి తలంబ్రాల పేరుతో కేవలం యూపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద ప్రచారం చేసింది. మతపరమైన వాతావరణాన్ని సృష్టించి ఈజీగా గట్టెక్కవచ్చని భావించింది. కానీ.. యూపీలోనే బీజేపీకి సగం సీట్లను ఓటర్లు కట్ చేశారు. దీంతో 62 నుంచి కాస్తా, బీజేపి 33కు పరిమితం కావాల్సి వచ్చింది.
‘అగ్నిపథ్’ దెబ్బతీసిందా?
బీజేపీ ఓటమికి అగ్నిపథ్ స్కీమ్ కూడా కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. తాను నిర్వహించిన ప్రతి ప్రచారంలో, ర్యాలీలో అగ్నిపథ్ స్కీమ్ గురించి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. జవాన్లను ప్రధాని నరేంద్ర మోదీ లేబర్లుగా మార్చేశారని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా.. రాజస్థాన్, హర్యానా నుంచి ఎక్కువ మంది యువకులు డిఫెన్స్, పారామిలటరీ ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తు న్నారు. 2019 ఎన్నికల్లో హర్యానాలో 10 సీట్లు బీజేపీ గెలిస్తే.. ఈసారి సగానికి పడిపోయా యి. రాజస్థాన్‌లోనూ ఇదే పరిస్థితి. 2019లో 25 సీట్లు గెలిస్తే ఈసారి సగానికి తగ్గాయి.