- 100 మెగావాట్ల కెపాసిటీతో ఏర్పాటుకు యూపీసీ వోల్ట్ సంస్థ అగ్రిమెంట్
- రూ.5 వేల కోట్ల పెట్టుబడులు.. సుమారు 4 వేల మందికి ఉపాధి
- రూ.623 కోట్ల పెట్టుబడితో ష్నైడర్ ఎలక్ట్రిక్ విస్తరణ
- దావోస్ వేదికగా మూడో రోజు 5,236 వేల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్ సాధించిన తెలంగాణ రైజింగ్ టీం
- గ్లోబల్ ఏఐ అకాడమీకి ‘పియర్సన్’ సహకారం.. కుదిరిన ఎంవోయూ
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో యూపీసీ వోల్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నది. యూపీసీ వోల్ట్ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రెన్యూవెబుల్స్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రెన్యూవెబుల్స్ ఇండియా సీఈవో అలోక్ నిగమ్‌తో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నెదర్లాండ్స్‌కు చెందిన యూపీసీ రెన్యూవెబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్స్ కలిసి యూపీసీ వోల్ట్ సంస్థగా ఏర్పడింది.
రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐకు అనుకూలమైన డేటా సెంటర్ నెలకొల్పనున్నది. ఈ ప్రాజెక్టుకు ఐదేండ్లలో రూ.5 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్ సరఫరాకు 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక రెన్యూవెబుల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే 3 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలుంటాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడంలో ఆధునిక డిజిటల్ మౌలిక వసతులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు అభివృద్ధిని సాధించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అధునాతన ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. నెట్ జీరో సిటీ అభివృద్ధే తెలంగాణ విజన్‌లో భాగమని పేర్కొన్నారు.
రూ.623 కోట్ల పెట్టుబడితో ష్నైడర్ ఎలక్ట్రిక్ విస్తరణ
రాష్ట్రంలో ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ తమ యూనిట్లను విస్తరించనున్నది. శంషాబాద్, గాగిల్లాపూర్‌లో రూ.623 కోట్ల పెట్టుబడితో విస్తరణ చేపడుతున్నట్టు వెల్లడించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆ కంపెనీ సీఈవో దీపక్‌శర్మతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులు, విద్యుత్ నిల్వ ప్రాజెక్టులు, గ్రిడ్ ఆధునీకరణ, విద్యుత్ సామర్థ్యం పెంపు, ఇండస్ట్రియల్ పార్కులు, పట్టణ మౌలిక వసతులకు డిజిటల్ విద్యుత్ నిర్వహణలాంటి అంశాలపై చర్చించారు. ఈ యూనిట్ల విస్తరణతో ఎలక్ట్రికల్ సేఫ్టీకి సంబంధించి ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు, మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్లు, కాంట్రాక్టర్లు, పుష్ బటన్ల తయారీ సామర్థ్యం పెరుగనున్నది. ష్నైడర్ ఎలక్ట్రిక్‌కు తెలంగాణలో 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 2047 నాటికి నెట్ జీరో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో పర్యావరణ పరిరక్షణ కీలకమని తెలిపారు. కాగా, ఇంధన నిర్వహణ, ఆటోమేషన్, ఈవీ భాగాల తయారీలో స్మార్ట్ ఫ్యాక్టరీల విస్తరణపై మంత్రులు చర్చించారు. ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా తెలంగాణ ఎదిగిందని వెల్లడించారు.
గ్లోబల్ ఏఐ అకాడమీకి సహకారం..
వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్‌కు అంతర్జాతీయ స్థాయిలో అపూర్వ స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వంతో బ్రిటన్‌కు చెందిన ప్రముఖ విద్యా, పబ్లిషింగ్ సంస్థ పియర్సన్ ఎంవోయూ కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో ఏర్పాటు కానున్న గ్లోబల్ ఏఐ అకాడమీకి పియర్సన్ సహకారం అందించనున్నది. ఏఐ శిక్షణ, పాఠ్య ప్రణాళిక, లెర్నింగ్ కంటెంట్, అంచనా విధానాలు, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్లలో తన నైపుణ్యాన్ని పియర్సన్ ఉపయోగించనున్నది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యువతకు ఏఐ శిక్షణ అందించి నైపుణ్యం కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ఎంవోయూ కుదుర్చుకున్న బృందాన్ని ఆయన అభినందించారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఏఐ సిటీ నిర్మాణానికి అవసరమైన పూర్తిస్థాయి ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే అన్ని ప్రముఖ టెక్ కంపెనీలు ఉన్నాయని, ప్రతిభ, మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, పియర్సన్‌తో కలిసి ఉన్నత నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల అభివృద్ధి దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రాజెక్టు త్వరితగతిన అమలుకు అవసరమైన అనుమతులు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
మరిన్ని ఒప్పందాలివే..
జార్జ్‌టౌన్ యూనివర్సిటీకి చెందిన ఏఐ కోల్యాబ్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నది. ఈ ఒప్పందం ద్వారా హెల్త్ సెక్టార్‌లో ఏఐ ఆధారిత రీసెర్చ్, ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అప్లయిడ్ రీసెర్చ్‌కు ఇది దోహదపడనుంది. అలాగే దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్‌తో కుదిరిన ఎంవోయూ ద్వారా స్టార్టప్‌ల అభివృద్ధికి అవకాశాలు అన్వేషించనున్నారు. 2 దేశాల మార్కెట్లు, ఎకో సిస్టమ్‌లపై అవగాహన కల్పించడంతో పాటు అంతర్జా తీయ సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలించనున్నారు.
