
కమర్షియల్ సినిమాల్లోనూ కొత్త తరహా కాన్సెప్టుల్ని టచ్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఉపేంద్ర. అందుకే ఆయన సినిమాలంటే కన్నడలోనే కాదు, తెలుగులోనూ స్పెషల్ క్రేజ్ ఉంది. ప్రస్తుతం ‘కబ్జ’ అనే ప్యాన్ ఇండియా మూవీలో నటిస్తున్న ఉపేంద్ర, నిన్న మరో భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. దీనికి ఆయనే దర్శకుడు కూడా. ప్రముఖ ఆడియో కంపెనీ లహరి మ్యూజిక్ నిర్మిస్తోంది. ‘ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉపేంద్ర కథను సృష్టించింది మీరే. ముప్ఫై మూడేళ్ల పాటు డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాసింది మీరే. ఈలలు, చప్పట్లతో దర్శకత్వం వహించిందీ మీరే. అలాంటి గొప్ప అభిమానులకు ఈ సినిమాని అంకితమిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు ఉపేంద్ర. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో కొమ్ములు తిరిగిన గుర్రంపై ముసుగుతో కనిపిస్తున్న ఉపేంద్ర లుక్ ఆసక్తికరంగా ఉంది. మండుతున్న గుర్రపు నాడా ‘యు’ ఆకారంలో కనిపించడాన్ని బట్టి ఈ సినిమా టైటిల్ ఇదేననిపిస్తోంది. గతంలో ఎ, ఓం, ష్ లాంటి షార్ట్ టైటిల్స్‌తో ఉపేంద్ర సినిమాలొచ్చిన విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమాకి కూడా సింగిల్ లెటర్ టైటిల్‌ని ఫిక్స్ చేసి ఉండొచ్చని అంచనా. ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీని కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ రూపొందిస్తున్నారు.