పబ్‌లు, బార్లలో UPI పేమెంట్స్ హవా.. పిచ్చిపిచ్చిగా జనం ఖర్చు చేస్తోంది దేనిపై అంటే?

పబ్‌లు, బార్లలో UPI పేమెంట్స్ హవా.. పిచ్చిపిచ్చిగా జనం ఖర్చు చేస్తోంది దేనిపై అంటే?

దేశంలో డిజిటల్ పేమెంట్ల జోరు నయా రికార్డులను సృష్టిస్తోంది. గత కొన్ని నెలలుగా పబ్‌లు, బార్లలో నెమ్మదించిన యూపీఐ పేమెంట్స్ ఏప్రిల్ నెలలో మళ్లీ పుంజుకున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా వరుస క్షీణతను చూసిన ఈ రంగం.. ఇప్పుడు సానుకూల వృద్ధిని నమోదు చేసింది.

బార్లు, క్లబ్‌లు, నైట్‌క్లబ్‌లలో యూపీఐ ద్వారా జరిగిన ఖర్చులు ఏప్రిల్‌లో ఏడాది ప్రాతిపదికన 3 శాతం పెరిగాయి. అంతకుముందు మార్చిలో 1.7%, ఫిబ్రవరిలో 2.4%, జనవరిలో 1% చొప్పున తగ్గుతూ వచ్చిన ట్రెండ్ ఇప్పుడు రివర్స్ అయింది. 2024 ఏప్రిల్, మే నెలల్లో 20 శాతానికి పైగా వృద్ధిని చూసిన ఈ కేటగిరీ పేమెంట్స్.. 2025 చివరి నాటికి దాదాపు స్తంభించిపోయింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో వీకెండ్ హ్యాంగౌట్లు, సామాజిక కార్యక్రమాలు పెరగడం, విలాసవంతమైన ఖర్చులకు ప్రజలు మొగ్గు చూపడంతో మళ్లీ మునుపటి కళ వచ్చింది.

రెస్టారెంట్లు, బేకరీల్లో పండగే..
కేవలం పబ్‌లు మాత్రమే కాదు, ఫుడ్ అండ్ డైనింగ్ బిజినెస్ అంతటా ఆర్ధిక కార్యకలాపాలు మెరుగయ్యాయి. రెస్టారెంట్లు, హోటళ్లలో యూపీఐ చెల్లింపులు 17 శాతం పెరగగా.. ఫాస్ట్‌ఫుడ్ చైన్లలో ఏకంగా 34 శాతం వృద్ధి చెందాయి. బేకరీలలో 34 శాతం.. చాక్లెట్లు, స్వీట్ షాపుల్లో 45 శాతం మేర బిజినెస్ పెరిగింది. ద్రవ్యోల్బణం ప్రభావం ఉన్నప్పటికీ ప్రజలు లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్ కోసం ఖర్చు పెట్టడానికి వెనకాడటం లేదని ఈ లెక్కలు చెబుతున్నాయి.

లిక్కర్ షాపుల్లో యూపీఐ వాడకం మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది. వైన్, బీర్ షాపుల్లో యూపీఐ చెల్లింపులు ఏప్రిల్‌లో ఏకంగా 79 శాతం పెరిగాయి. 2025లో నమోదైన వంద శాతానికి పైగా వృద్ధితో పోలిస్తే ఇది కొద్దిగా తక్కువే అయినప్పటికీ.. ఇప్పటికీ టాప్ గేర్లోనే ఉంది. సిగార్, పొగాకు దుకాణాల్లో 48 శాతం అమ్మకాలు పెరిగాయి. మరోవైపు ఆన్‌లైన్ షాపింగ్ మార్కెట్లలో 82 శాతం యూపీఐ చెల్లింపులు పెరిగాయి. వీటన్నింటినీ మించి.. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో 'డిజిటల్ గోల్డ్' కొనుగోళ్లు ఏకంగా 258 శాతం పెరగడం అందరినీ షాక్ కి గురిచేస్తోంది. 

నిత్యావసరాలు ఓకే.. పెట్రోల్ డౌన్
కిరాణా దుకాణాలు, సూపర్‌మార్కెట్లలో 38 శాతం, డైరీ ప్రొడక్ట్స్‌పై 36 శాతం చొప్పున యూపీఐ లావాదేవీలు పెరిగాయి. అయితే ఇంధన ఖర్చులు మాత్రం తగ్గాయి. పెట్రోల్ బంకుల్లో కేవలం 19 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది, ఇది గత ఏడాదితో పోలిస్తే చాలా తక్కువ. అలాగే టెలికాం సేవల చెల్లింపులు జస్ట్ 2 శాతం వృద్ధికే పరిమితమయ్యాయి.