
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు వారి భద్రత కోసం ప్రోటోకాల్ ప్రకారం.. ప్రభుత్వం ఇద్దరు గన్ మెన్లను నియమిస్తుందనే విషయం తెలిసిందే. అయితే ఓ ఎమ్మెల్యే మాత్రం తనకు గన్ మెన్లు ఎందుకంటున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే వారు మాత్రమే గన్ మెన్లను పెట్టుకుంటారని అంటున్నారు.
అయనే నూతనంగా ఎన్నికైన ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. రాష్ట్రంలో గత నెల నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి బండారి లక్ష్మారెడ్డి పోటీ చేసి గెలుపొందారు. దీంతో ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు ఇద్దరు గన్ మెన్లను నియమించింది. అయితే, బండారి లక్ష్మారెడ్డి తనకు కేటాయించిన గన్ మెన్లను వద్దని తిరస్కరించి తిప్పి పంపారు.
అవినీతికి పాల్పడే వారికి, ఇల్లీగల్ పనులు చేసేవారికి గన్ మెన్లు అవసరం.. కానీ నిత్యం ప్రజల్లో ఉండే తనకు గన్ మెన్లు అవసరం లేదని అన్నారు. తాను స్వేచ్ఛగా ప్రజలను కలుస్తూ నియోజకవర్గంలో తిరుగుతానని.. వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని.. అందుకే గన్ మెన్లను తిప్పి పంపించానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.