పనులు పూర్తి కాకుండానే ఓపెనింగ్​కు రెడీ!

పనులు పూర్తి కాకుండానే ఓపెనింగ్​కు రెడీ!

సికింద్రాబాద్​, వెలుగు: ఉప్పల్ క్రాస్​రోడ్ వద్ద రోజురోజుకి వెహికల్స్ రద్దీ పెరుగుతూ.. జనాలకు రోడ్డు దాటడం కష్టంగా మారడంతో మూడేండ్ల కిందట హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో స్కై వాక్ నిర్మాణం చేపట్టారు. ఏడాదిన్నరలోగా పూర్తి చేయాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నప్పటికీ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. మరో వైపు ఈ నెల 9న  మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఉప్పల్ స్కై వాక్ ప్రారంభోత్సవానికిఅధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెండింగ్ పనులు పూర్తిచేసేందుకు రెండ్రోజులే ఉండటంతో ప్రారంభోత్సవం తర్వాత స్కై వాక్ అందుబాటులోకి వస్తోందోరాదోననే అనుమానాలు నెలకొన్నాయి.

రోడ్డు దాటే సమయంలో ప్రమాదాలు..

గ్రేటర్ సిటీలో అత్యంత రద్దీగా ఉండే ఏరియాల్లో ఉప్పల్ జంక్షన్ ఒకటి.  ఎల్ బీనగర్, నాగోల్ మీదుగా తార్నాక, సికింద్రాబాద్​కు, వరంగల్ హైవే నుంచి రామంతాపూర్, అంబర్ పేట వైపునకు ఉప్పల్ జంక్షన్ నుంచి వెళ్లాల్సిందే. మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉప్పల్ క్రాస్ రోడ్ మీదుగా వెళ్లే వెహికల్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ఉప్పల్ జంక్షన్  వద్ద ఓ వైపు నుంచి మరోవైపునకు రోడ్డు దాటాలంటే మహిళలు, స్కూల్, కాలేజీ స్టూడెంట్లు, వృద్ధులకు ఇబ్బందిగా మారింది.  రోడ్డు దాటే టైమ్​లో వెహికల్స్ ఢీకొని ఎంతో మంది గాయపడ్డారు.   ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఉప్పల్ క్రాస్ రోడ్ లోని నాలుగు రోడ్లను కలుపుతూ రూ.25 కోట్లతో స్కైవాక్​ నిర్మించాలని 2020 జులైలో హెచ్ఎండీఏ ప్రతిపాదనలు చేసింది. అదే ఏడాది డిసెంబర్ లో పనులు ప్రారంభించింది. నాగోల్ వైపు, రామంతాపూర్ రోడ్, ఉప్పల్ మున్సిల్ సర్కిల్ ఆఫీసు సమీపంలోని థీమ్ పార్కు, వరంగల్ బస్టాప్, ఉప్పల్ పీఎస్, ఎలక్ర్టికల్ సబ్​ స్టేషన్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్​ పాయింట్లు ఏర్పాటు చేశారు. స్కై వాక్​కు 8 లిఫ్ట్ లు, 4 ఎస్కలేటర్లు, వాటిని ఆనుకుని 6 మెట్లదారుల నిర్మాణం చేపట్టారు.  2022 ఫిబ్రవరి నాటికి పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ ఆ టైమ్ లో 60 శాతం కూడా పూర్తి కాలేదు. దీంతో అనుకున్న టైమ్ కు స్కై వాక్ అందుబాటులోకి రాలేదు.

తొందరగా  అందుబాటులోకి తేవాలి

వెహికల్స్ రద్దీ కారణంగా ఉప్పల్ క్రాస్ రోడ్ లో యాక్సిడెంట్లు ఎక్కువయ్యాయి. పాదచారులు ప్రమాదాలు బారిన పడకుండా నిర్మిస్తున్న స్కై వాక్ పనులు స్లోగా జరుగుతున్నాయి. ఇప్పటికే స్కై వాక్ ప్రారంభోత్సవం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఈసారినా ప్రారంభించిన వెంటనే జనాలకు అందుబాటులోకి తేవాలి. ఈ  స్కై వాక్​ అందుబాటులోకి వస్తే  ఉప్పల్ క్రాస్ వద్ద డైలీ సుమారు 20 వేల నుంచి 30వేల మంది పాదచారులు సేఫ్ గా రోడ్డు దాటొచ్చు.
- గొనె శ్రీకాంత్, ఉప్పల్


పెండింగ్ పనులు ఇవే.. 

రామంతాపూర్ వైపు మెట్ల పనులు నిర్మాణ దశలో ఉండగా.. మున్సిపల్ థీమ్ పార్కు, ఉప్పల్ పీఎస్ ఎదురుగా ఉన్న మెట్ల దారి పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. స్కై వాక్ చుట్టూ, మెట్ల దారి వైపు ఫుట్ పాత్ నిర్మాణాలు పూర్తి కాలేదు. థీమ్ పార్కు నుంచి ఉప్పల్ పీఎస్ వరకు ఉన్న స్కైవాక్ బ్రిడ్జి నిర్మాణం కోసం కేవలం స్టీల్ కడ్డీలను మాత్రమే అమర్చారు. వాటిపై నడిచేందుకు వీలుగా స్టీల్ ప్లేట్లతో వాక్ వే నిర్మించి.. దానిపై లైట్లు అమర్చాల్సి ఉంది. దీంతోపాటు స్టీల్ కడ్డీల చుట్టూ రెయిలింగ్ ఏర్పాటు చేసి వాటిని అందంగా తీర్చిదిద్దాల్సి ఉంది. ఈ పనులన్నీ ఎంత స్పీడ్ గా చేసినా సుమారు 10 నుంచి 15 రోజల వరకు టైమ్ పట్టొచ్చని అక్కడ పనిచేస్తున్న కార్మికులు చెబు తున్నారు. దీంతో స్కై వాక్ ను ముందు ప్రారంభించి.. ఆ తర్వాత పనులు చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.