లండన్: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ లండన్ పర్యటనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కు చెందిన బిర్క్‌బెక్ కాలేజీలో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు కొందరు ఆయన గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రశ్నలు లేవనెత్తారు. దాంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ 4న సీజేఐ ‘‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నేషనల్ లా” అనే అంశంపై ప్రసంగించారు.
అనంతరం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఒక వ్యక్తి ‘‘భారత్‌లో ప్రజాస్వామ్య పరిస్థితులు, అసమ్మతి స్వరాల అణచివేత’’పై ప్రశ్నించారు. మరొకరు ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. అయితే, ప్రస్తుత చర్చ కేవలం ‘కృత్రిమ మేధస్సు’కే పరిమితమని నిర్వాహకులు ఆ ప్రశ్నలను తిరస్కరించడంతో సభలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై యూకేలోని భారత హైకమిషన్ స్పందిస్తూ.. సభకు అంతరాయం కలిగించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.
