అఖిల భారత సర్వీసుల్లో మన దేశ యువతలో చాలా మందికి ఉండే కల.. ఆ కలను సాకారం చేసుకునేందుకు తొలి మెట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష మే 31న జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది యూపీఎస్సీ.
కమిషన్ చైర్మన్ అర్వింద్ సక్సేనా నేతృత్వంలో సోమవారం జరిగిన సమావేశంలో ఎగ్జామ్ వాయిదాపై నిర్ణయం తీసుకున్నట్లు యూపీఎస్సీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో దేశ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించడం మంచిది కాదన్నారు. పైగా అనేక ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్లుగా అనుకున్న కాలేజీలను ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లుగా వినియోగిస్తోందని చెప్పారు. ప్రస్తుతం వాయిదాపై నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఇప్పుడే కొత్త డేట్ ప్రకటించలేమని చెప్పారు. అయితే మే 20 నాటికి దేశంలో పరిస్థితులపై మరోసారి సమీక్ష నిర్వహించి.. ఆ రోజున కొత్త తేదీని ప్రకటించే అవకాశం ఉందన్నారు.
ఆగస్టులో ఉండొచ్చేమో..
ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందన్న దానిపై క్లారిటీ లేకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోందని, తప్పనిసరి పరిస్థితుల్లో ఎగ్జామ్ వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందేనని సివిల్స్ రెండోసారి అటెంప్ట్ చేస్తున్న స్నిగ్ధా (25) అనే యువతి చెప్పింది. అయితే తమ ప్రిపరేషన్ కు మరింత సమయం దొరుకుతోందని, అభ్యర్థులకు ఈ వాయిదాతో మంచే జరుగుతుందని అభిప్రాయపడిందామె. ఆగస్టు నెలలో పరీక్ష జరగొచ్చని ఆశిస్తున్నానని తెలిపింది. అయితే ఇప్పుడు ప్రిలిమ్స్ పోస్ట్ పోన్ చేసినందున ఆ తర్వాత మెయిన్స్ కు సమయం తగ్గిస్తారని అనుకోవడం లేదని, మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి కూడా తగిన సమయం ఇస్తారని భావిస్తున్నాని ఆ యువతి చెప్పింది.
