- రూ.59.3 కోట్ల లాస్ ప్రకటించిన కంపెనీ
న్యూఢిల్లీ: ఇంటి వద్దకు వచ్చి సర్వీస్‌లు అందించే అర్బన్ కంపెనీ, ఐపీఓకి వచ్చిన తర్వాత విడుదల చేసిన మొదటి క్వార్టర్‌లో నష్టాలను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) లో రూ.59.3 కోట్లు నష్టపోయింది. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో రూ.6.9 కోట్ల నికర లాభాన్ని, కిందటేడాది ఇదే కాలంలో రూ.1.82 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. క్యూ2లో ఇన్‌స్టా హెల్ప్ అనే కొత్త డైలీ హౌస్ కీపింగ్ కంపెనీలో పెట్టుబడి పెట్టడంతో నష్టం వచ్చిందని కంపెనీ పేర్కొంది.
ప్రధాన సేవల విభాగాల్లో వృద్ధి కొనసాగిస్తున్నామంది. అర్బన్ కంపెనీ మొత్తం ఆదాయం క్యూ2లో ఏడాది లెక్కన 37శాతం పెరిగి రూ.277 కోట్ల నుంచి రూ.380 కోట్లకు చేరింది. జూన్ క్వార్టర్‌లో వచ్చిన రూ.367 కోట్ల నుంచి వృద్ధి కనిపించింది. కంపెనీ ఖర్చులు రూ.462 కోట్లకు పెరిగాయి. జూన్ క్వార్టర్‌లో ఇది రూ.384 కోట్లుగా నమోదైంది. ‘‘కంపెనీ దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి పెడుతోంది.
తాత్కాలిక లాభాలకంటే వినియోగదారుల దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యం. కంపెనీ రూ.2,136 కోట్ల క్యాష్ ఫ్లోతో క్యూ2ని ముగించింది (ఐపీఓ ద్వారా వచ్చిన నిధులు)”అని అర్బన్ కంపెనీ సీఈఓ అభిరాజ్ సింగ్ బెహల్ అన్నారు.
