ఏజెన్సీ ఏరియాలో యూరియా దందా

ఏజెన్సీ ఏరియాలో యూరియా దందా

సర్కార్​ ఇచ్చేది సరిపోతలె

నష్టపోతున్న రైతులు

ఆసిఫాబాద్,వెలుగుకుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో యూరియా కొరత వేధిస్తోంది. కొందరు వ్యాపారులు పక్కనున్న మహారాష్ట్ర నుంచి తెప్పించి బ్లాక్​లో అమ్ముతున్నారు. కృతిమ కొరత సృష్టించి రైతులను దోచుకుంటున్నారు. నియంత్రించాల్సిన ఆఫీసర్లు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

బస్తా రూ.400 పైనే..

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. వేసిన పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. సర్కార్​ అందించే యూరియా సరిపోవడంలేదు. దీంతో చాలామంది ప్రైవేట్​ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్న కొందరు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. సర్కార్​ అందించే ధరకు రెండింతలు పెంచి అమ్ముతున్నారు. సహకార సంఘాల ద్వారా ఒక బస్తా రూ.266.50 లకు అమ్ముతుండగా ప్రైవేట్​ వ్యాపారులు రూ.400కు బస్తా అమ్ముతున్నారు.

పత్తి పంటే ఎక్కువ..

జిల్లాలో  3.40 లక్షల ఎకరాల్లో పత్తి, 60,323 ఎకరాల్లో వరి సాగవుతోంది. దీనికి 49 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం గవర్నమెంట్​ 26 వేల మెట్రిక్​ టన్నులు మాత్రమే సరఫరా చేసింది.దీంతో దళారులు యూరియా మహారాష్ట్ర నుంచి తెప్పించి అమ్ముతున్నారు.

జీరో దందా…

రైతుల అవసరాన్ని తెలుసుకున్న ఎరువుల వ్యాపారులు ఏటా ఎరువులు, పురుగుల మందుల కొరత సృష్టిస్తున్నారు. సర్కార్​ యూరియా అందక పోవడం… పంటలకు ఎరువులు వేసే టైం ఎత్తిపోతుండడంతో చాలామంది రైతులు ధర ఎంతైనా సరే అంటూ దళారులను ఆశ్రయిస్తున్నారు. అవసరాన్ని ‘క్యాష్​’ చేసుకుంటున్న కొందరు యథేచ్ఛగా దందా నడుపుతున్నారు.

ఏజెన్సీ ప్రాంతంలో..

ఏజెన్సీలోని రైతులకు జైనూర్ మార్కెట్ మెయిన్ సెంటర్. దాదాపు 30 మంది వరకు ఫర్టిలైజర్ డీలర్లు ఉన్నారు. ఇక్కడే సిర్పూర్ (యు) ,లింగాపూర్ మండలాల రైతులు ఎరువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు యూరియా బ్యాగ్​ యూరియా ధర 266 ఉంటే రూ. 350 నుంచి 400 వరకు అమ్ముతున్నట్లు పలువురు ఆరోపించారు. రసీదు కూడా ఇవ్వడంలేదని తెలిపారు.

కలెక్టర్​ హెచ్చిరించినా అంతే..

యూరియా అధిక ధరకు అమ్మితే కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హెచ్చరించారు. బస్తా రూ. 266.50 లకు మించి అమ్మొద్దన్నారు. అయినా అమ్మితే పీడీ యాక్ట్​ నమోదు చేస్తామన్నారు. డీలర్ల లైసెన్స్​లు రద్దు చేస్తామని చెప్పారు. అయినా ఎవరూ పట్టించుకున్నట్లు కనిపించడంలేదు.

యూరియా దొరకక ఇబ్బంది..

పత్తి, వరి సాగు చేస్తున్న. వర్షాలు బాగానే పడ్డాయి. అయితే ఇప్పుడు పూత, కాత దశలో ఉన్న పంటకు యూరియా అవసరం. డీలర్ ల దగ్గర బస్తా ఒకదానికి వంద రూపాయలు ఎక్కువగా తీసుకుంటున్నారు. –కొండు రాజేశ్​, బాబాసాగర్

రసీదు ఇస్తలె

ఎరువులు అధిక ధరకు అమ్ముతున్నారు. కొన్న తర్వాత రసీదు ఇస్తలేరు. అడిగితే బుక్కు లేదంటున్నారు. వేరే షాపులో ఇంకా ఎక్కువ ధరకు అమ్ముతున్రు. మీ ఇష్టం మళ్లీ కావాలంటే దొరకదని భయపెడుతున్రు. దిక్కు లేక ఎక్కువ ధర పెట్టి బ్యాగు తీసుకున్న.–ఆత్రం లేతపటేల్, లొడ్డిగూడ, జైనూర్

ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు

యూరియా ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. బస్తాలు కొనుగోలు చేసిన రైతులు తప్పనిసరిగా రిసిప్ట్​ తీసుకోవాలె. మహారాష్ట్ర నుంచి తెస్తున్న వారిపై నిఘాపెట్టాం. –రవీందర్, డీఏవో.