అన్నదాతలకు కన్నీళ్లు తెప్పిస్తున్న యూరియా కష్టాలు

అన్నదాతలకు కన్నీళ్లు తెప్పిస్తున్న యూరియా కష్టాలు

అన్నం పెట్టే రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు వానలు, విత్తనాల కోసం ఎదురు చూసిన అన్నదాతలకు …ఇప్పుడు యూరియా కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈసారి కొరత రాకుండా చూస్తామన్న అధికారులు… ఇప్పుడు పట్టించుకోకపోవడంతో .. ఎరువుల కోసం బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జగిత్యాల జిల్లాలో రోజురోజుకు యూరియా కొరత తీవ్రమవుతోంది. యూరియా కోసం అన్నదాతలు ఆందోళన చేస్తున్నా…అధికారులు మాత్రం స్పందించడం లేదు. యూరియా డిమాండ్ తో.. జగిత్యాల సహకార సంఘం దగ్గర ఉదయం ఐదింటి నుంచి  రైతులు చెప్పులతో  క్యూలైన్లలో నిల్చుంటున్నారు. అయితే తమకు కావాల్సినంత యూరియా ఇవ్వడంలేదంటూ…ఆందోళనకు దిగారు అన్నదాతలు. జగిత్యాల – నిజామాబాద్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో యూరియా కష్టాలు అన్నీ ఇన్నీకావు. వర్షాలు జోరందుకోవడంతో రెండు రోజులుగా యూరియా కోసం డీసీఎంఎస్ గోదాముల చుట్టూ తిరుగుతున్నారు అన్నదాతలు. వారం రోజులుగా యూరియా స్టాక్ రాకపోవడంతో…ఒక్కో రైతుకు మూడు బస్తాలే పంపిణీ చేస్తున్నారు. దీంతో ఎక్కువ మొత్తంలో యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. రుద్రంగి, చందుర్తి మండలాల్లో బారులు తీరారు రైతులు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న…సరిపడనంత యూరియా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పోలీసులు కొత్త ట్రాఫిక్ చట్టంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేయడంపై..రైతులు మండిపడ్డారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో యూరియా కోసం బారులు తీరారు రైతులు. సరిపడినంత స్టాక్ ఉన్నా డీలర్లు కావాలనే కొరత సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. యూరియా కోసం పొద్దున వచ్చి క్యూ లైన్ లో నిలబడితే.. అధికారులు మాత్రం పైరవీలతో వచ్చిన వారికే ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. నాలుగైదు రోజులుగా యూరియా కోసం ఎదురుచూస్తుంటే….సరిపడినంత ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా.. పాలకుల మారిన తమ కష్టాలు మాత్రం తీరడం లేదంటున్నారు రైతులు. సీజన్ కు ముందే.. సరిపడా విత్తనాలు, యూరియా స్టాక్ ఉంచితే… ఈ ఇబ్బందులు ఉండేవి కాదంటున్నారు.