అక్కర లేకున్నా కొంటున్రు...యాదాద్రి జిల్లాలో భారీగా పెరిగిన యూరియా సేల్స్

అక్కర లేకున్నా కొంటున్రు...యాదాద్రి జిల్లాలో భారీగా పెరిగిన యూరియా సేల్స్
  •     కొన్నొళ్లే  మళ్లీ కొంటున్నరు
  •     ఈ నెల 8 నుంచి జిల్లాలో యాప్ ద్వారా బుకింగ్ స్టార్ట్​
  •     పది రోజుల్లోనే 3 వేల టన్నులు సేల్ 
  •     వచ్చే నెల కోటా కూడా అప్పుడే కొనేశారు 
  •     గతేడాది మార్చి నాటికి 23,254 టన్నులు 
  •     నెల ముందే  26,150 టన్నులు సేల్

యాదాద్రి, వెలుగు:  యాదాద్రి జిల్లాలో యూరియా కొనుగోలు​ విపరీతంగా పెరిగిపోయింది. కొనుగోలు చేసిన వాళ్లే అవసరానికి మించి మళ్లీ కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిణామంతో నెల ముందుగానే సీజన్​ టార్గెట్​ మించి కొనుగోళ్లు జరిగిపోయాయి. దీంతో అవసరానికి కొనుగోలు చేసే రైతులకు యూరియా అందడం లేదు. 

యాదాద్రిలో 8.55  లక్షల ఎకరాలు

యాదాద్రి జిల్లాలో 8,55,922 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇందులో సాగుకు అనువైన భూమి 6,18,390 ఎకరాలు భూమి ఉండగా సాగు చేయని భూములు 63,222 ఎకరాలు ఉన్నాయి. సాగుకు యోగ్యంకాని  భూములు 65,157 ఎకరాలు ఉండగా 26,616 ఎకరాల్లో అటవీ భూమి విస్తరించి ఉంది. అయితే సాగుకు అనువైన భూముల్లో దాదాపు 5 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు కలిపి దాదాపు 2.50 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారు. ఈ సీజన్​లో జిల్లాలో 3.05 లక్షల ఎకరాల్లో వరిని రైతులు సాగు చేస్తున్నారు.  

45 రోజుల ముందుగానే కోటా కంప్లీట్​

పంటల సాగు కోసం ప్రతి సీజన్లో రైతులు దాదాపు 24 వేల టన్నుల యూరియా కొనుగోలు చేస్తున్నారు. సబ్సిడీపై అందిస్తున్న యూరియా పక్కదారి పడుతోంది. దీంతో  కృత్రిమ కొరత ఏర్పడి  గడిచిన వానా కాలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఈ పరిణామాలతో ప్రభుత్వం యాప్​ను అందుబాటులోకి తెచ్చి దీని ద్వారానే రైతులు యూరియాను కొనుగోలు చేయాలని సూచించింది. 

అయితే మార్చి వరకూ 24 వేల టన్నులు కొనుగోలు చేయాల్సి ఉండగా ఫిబ్రవరి మొదటి వారంలోనే 23,075 టన్నుల యూరియాను రైతులు కొనేశారు. ఫిబ్రవరి 8 నుంచి యూరియా కొనుగోలు కోసం యాప్​ అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత గతంలో కొనుగోలు చేసిన రైతుల్లో కొందరు మళ్లీ కొనుగోలు చేశారు. ఈ పది రోజుల్లోనే 3వేల టన్నుల యూరియాను కొనుగోలు చేశారు.

అవసరానికి  మించి బుకింగ్​

రెగ్యులర్​గా ప్రతీ సీజన్​కు 24 వేల టన్నుల యూరియా అవసరం పడుతోంది. అది కూడా యాసంగి సీజన్​లో అయితే అక్టోబర్​ నుంచి  మార్చి వరకూ విడతల వారీగా ఉపయోగించాల్సి ఉంటుంది. గత యాసంగి సీజన్​లో 3.12 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేయగా 23,254 టన్నుల యూరియా కొనుగోలు చేశారు. కానీ ఈ సీజన్​లో మాత్రం ఫిబ్రవరి 17 వరకు 26,150 టన్నుల యూరియా కొనుగోలు చేశారు. యూరియా ఉపయోగిండానికి ఇంకా నెల రోజులు సమయం ఉండగానే సీజన్​ కోటా కంప్లీట్​ చేశారు. ఇంకా యూరియాను బుకింగ్​ చేస్తూనే ఉన్నారు. 

దీనివల్ల వచ్చిన స్టాక్​ వచ్చినట్టే సేల్​అయిపోతోంది. దీనికి కారణం ఒక్కో ఎకరానికి రెండున్నర బస్తాలు మాత్రమే యాప్ లో కొనుగోలు చేయొచ్చు. అయితే సాగుకు అనుకూలంగా లేని భూములు ఉన్నవారు... కొందరు సాగు చేయని భూములకు కూడా యాప్ లో యూరియా కొనుగోలు చేయడంతో స్టాక్ వెంట వెంటనే అయిపోతుంది. దీని వల్ల నిజంగా యూరియా అవసరం ఉండి బుక్​ చేస్తున్నా.. అంతకు ముందే స్టాక్​ అయిపోతోంది. దీంతో అవసరమైన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 

గత యాసంగి, ఈ యాసంగిలో యూరియా కొనుగోలు టన్నుల్లో

నెల              2024-25      2026-26
అక్టోబర్​        1033           1138
నవంబర్​     708             906
డిసెంబర్​    3696           8221
జనవరి        8476           9984
ఫిబ్రవరి      8542           5901
మార్చి        799             0000
మొత్తం      23254         26150