పెంట తక్కువాయే.. యూరియా ఎక్కువాయే..! గ్రామాల్లో పశువులతో పాటే కనుమరుగైన పెంట బొందలు

పెంట తక్కువాయే.. యూరియా ఎక్కువాయే..! గ్రామాల్లో పశువులతో పాటే కనుమరుగైన పెంట బొందలు
  • కృత్రిమ ఎరువులకు అలవాటు పడిన రైతులు
  • ఊళ్లల్లో చెత్త డంపు యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లలో అటకెక్కిన సేంద్రియ ఎరువుల తయారీ
  • అతిగా ఎరువుల వాడకంతో అనర్థాలు
  • ఇండ్లలో సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవాలని నిపుణుల సలహా

కరీంనగర్ , వెలుగు: ఒకప్పుడు పంట పొలాల్లో ఎరువుగా వాడిన పెంటలిప్పుడు కనుమరుగయ్యాయి. గ్రామాల్లో పశువులు లేవు. వాటి పేడ లేదు. ఇంటి దగ్గర తడిచెత్త కూడా పాశితో పాటే చెత్త బండ్లలో సెగ్రిగేషన్​ షెడ్లకు చేరుతున్నది. అక్కడ సేంద్రియ ఎరువును తయారుచేసి, రైతులకు ఇవ్వాలని భావించినా సాధ్యం కావడం లేదు. అటు పొలాల్లో గొర్ల మందలను పెట్టించే పరిస్థితీ లేదు. గతంలో మాదిరి చెరువు మట్టినీ తోలడం లేదు. దీంతో యూరియా, డీఏపీ లాంటి కృత్రిమ ఎరువులపైనే రైతులు ఆధారపడ్తున్నారు. సెంటర్ల దగ్గర బస్తాల కోసం కుస్తీ పడ్తున్నారు. 

కృత్రిమ ఎరువులను అతిగా వాడడం వల్ల నీరు, నేల, గాలి కలుషితమవుతున్నాయని, భూములు నిస్సారమై, భవిష్యత్​లో పంటలు పండని పరిస్థితి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈగలు, దోమలు వృద్ధి చెందుతాయనే భయంతో  ఇండ్ల దగ్గర పెంట బొందలను తొలగిస్తున్నారని, కానీ, అధునాతన పద్ధతుల్లో తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువులు తయారుచేసుకొని పొలాల్లో వేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. 

పశువులు పాయే.. పెంటలూ పాయే.. 

గ్రామాల్లో రైతులకు గతంలో ఇంటికి జత, రెండు జతలకు మించి ఎడ్లు, పాల కోసం గేదెలు ఉండేవి. వీటి నుంచి వచ్చే పెండ, పశువులు మేయగా మిగిలిన గడ్డి, వాటి మూత్రంతో తడిసిన కసవు, ఇళ్లలోని ఇతర వ్యర్థాలను రైతులు తమ ఇంటి వెనకాలో, ముందో పెంటగా పోగు చేసేవారు. ఎండాకాలం వచ్చిందంటే  ఇలా ఏడాది పాటు పోగైన పెంటను పొలాల్లోకి రైతులు తోలేవారు. ఈ ఎరువు చల్లిన తర్వాత భూమిని కలియదున్నితే నత్రజని, భాస్వరం, పొటాష్‌‌తో పాటు సూక్ష్మ పోషకాలు తగిన మోతాదులో పంటలకు అందేది. అంతేగాక ఈ సేంద్రియ ఎరువు భూమిలోని ఆమ్లాలు, క్షారాల స్థాయిని నిలబెట్టడంతో పాటు మంచి సూక్ష్మజీవుల వృద్ధికి తోడ్పడేది. 

నేల గుల్లబారి మొక్కల వేర్లు లోపలికి చొచ్చుకొని పోయేవి. తద్వారా పంటలు ఏపుగా పెరిగి, గట్టి గింజలకు అవకాశముండేది. అందుకే ‘పెంట కొద్దీ పంట’ అనే నానుడి పుట్టుకొచ్చింది. ఈ సహజ ఎరువుతో యూరియా అవసరం తక్కువగా ఉండేది. కానీ, యాంత్రికీకరణ కారణంగా పరిస్థితి మారిపోయింది. చాలా మంది రైతులు పొలాలు, దుక్కులు దున్నడానికి ఎడ్లకు బదులు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. పాల కోసం పెంచే బర్రెలు తప్ప మిగతా పశువులు పెద్దగా కనిపించడం లేదు. పేడతో తయారయ్యే ఎరువు, పెంట బొందలు క్రమంగా కనుమరుగైపోయాయి. దీంతో పశువుల ఎరువు లేక రసాయనిక ఎరువులనే వినియోగించాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. 

రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయాలెన్నో  ! 

రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయాలు ఎప్పటి నుంచో ఉన్నా  రైతులు వీటి వైపు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఓ గుంట తవ్వి అందులో కలుపు మొక్కలు, తడిచెత్త, ఇతర వ్యర్థ పదార్థాలను వేసి తగినంత నీళ్లు పోసి పెడితే కొన్నాళ్లకు కంపోస్టు ఎరువు తయారవుతుంది. దీనిని ఏ పంట వేసే ముందైనా వాడుకోవచ్చు. అలాగే గుంటను తవ్వి  పశువుల పెండ, పచ్చి కలుపు మొక్కలు, పంట పొలాలలోని ఇతర చెత్తాచెదారం వేసి వాటిపై వానపాములు వదిలితే వర్మీ కంపోస్టు తయారవుతుంది. 

వీటితో పాటు గొర్రెలు, మేకల ఎరువుతో పాటు కోడి పెంట భూసారాన్ని ఇతోథికంగా పెంచుతాయి. వరి వేయడానికి ముందు చేనును దున్నుకుని పెసరు, జనుము, నీలి, జీలుగు వంటి పంటను వేసుకుని పూత దశలో భూమిలో కలిసేట్లుగా దున్నితే  పంటకు సరిపోయేంత నత్రజని లభిస్తుంది. వీటితోపాటు వేప పిండి ఎరువుగా పనిచేస్తుంది.  

పెంట బొందలు లేకుండా పోయాయ్..

గతంలో మాకు ఎడ్లు ఉండే. పశువుల పేడతో పాటు, ఇంట్లో పోగయ్యే చెత్తను ఇంటికి దగ్గర్లో ఉన్న పెంటలో వేసేటోళ్లం. పెంటలో తయారయ్యే ఎరువును ఏటా పొలాల్లో ఎరువుగా చల్లెటోల్లం. ఇపుడు పశువులు లేవు. పెంట బొందలు  లేవు. పశువులు ఉన్న వాళ్ల దగ్గర ఎరువు కొందామంటే  ట్రాక్టర్ కు రూ.2 వేలు చెప్తున్నరు. దీంతో 20:20 ఎరువు సంచులు కొనుక్కొచ్చి చల్లుతున్నాం.
- అల్లపురం వీరేశ్, శివ్వంపేట, మెదక్  జిల్లా

పెరిగిన యూరియా వినియోగం..

శాస్త్రీయంగా వరి, పత్తి పంటకు ఎకరాకు సిఫార్సు చేసిన యూరియా మోతాదు సుమారు 90 కిలోలు మాత్రమే. ఇది కూడా మూడు లేదా నాలుగు సార్లు వేయాల్సి ఉంటుంది. కానీ, రైతులు మాత్రం 150 నుంచి 180 కిలోల దాకా చల్లుతున్నారు. మొక్క జొన్న పంటకు 135 కిలోలు వినియోగించాల్సి ఉంటే 225 కిలోలు వినియోగిస్తున్నారు. ఇలా యూరియాను ఎక్కువగా వాడడం వల్ల  భూసారం దెబ్బతినడంతో పాటు ఆ పంటల ఉత్పత్తులను వినియోగిస్తున్న జనాల ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. 

2023–24 రబీ సీజన్ తో పోలిస్తే 2024–25 రబీ సీజన్ లో యూరియా అమ్మకాలు 21 శాతం ఎక్కువ అయ్యాయి. అలాగే 2024 ఖరీఫ్ సీజన్ తో పోలిస్తే 2025 ఖరీఫ్  సీజన్​లో యూరియా వినియోగం 12.4 శాతం పెరిగింది.2020–--21లో 10.50 లక్షల టన్నులు, 2021–-22లో 12 లక్షల టన్నులు, 2022–-23లో 13.80 లక్షల టన్నులు, 2023–24లో 16 లక్షల టన్నులు, 2024-–-25లో 18.50 లక్షల టన్నుల యూరియా వినియోగించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇలా ఏటేటా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.