న్యూ ఢిల్లీ : లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించడమే కాకుండా.. మాస్క్ వేసుకోమని మంచి చెప్పినందుకు పోలీసులతో వాగ్వాదానికి దిగింది ఓ మహిళ. ఈ ఘటన ఢిల్లీలోని వసంత్ విహార్‌లో చోటు చేసుకుంది. ఉరుగ్వే దేశానికి చెందిన రాయబారి అనా వాలెంటినా ఒబిస్పో వసంత్ విహార్‌లో నివాసం ఉంటోంది. శనివారం ఆమె ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌస్‌లు ధరించకుండా ఆమె సైకిల్ పై రోడ్డు మీదకు వచ్చింది. అక్కడే లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఆమెను అడ్డుకొని ముఖానికి మాస్క్ ఎందుకు ధరించలేదని.. అని ప్రశ్నించారు. దేశమంతటా లాక్ డౌన్ ఉన్న సంగతి తెలియదా అని అడగడంతో ఆ మహిళ రెచ్చిపోయింది. పోలీసులతో గొడవ పడింది. గొడవ జరుగుతున్నప్పుడు స్థానిక కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు వచ్చి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా, ఆమె వినలేదు. దీంతో పోలీసులు ఉరుగ్యే ఎంబసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా, సంబంధిత సెక్షన్ల ప్రకారం సదరు యువతిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
