ఇరాన్ మహిళలకు మద్దతుగా జుట్టు కట్ చేసుకున్న నటి

ఇరాన్ మహిళలకు మద్దతుగా జుట్టు కట్ చేసుకున్న నటి

హిజాబ్ కు వ్యతిరేకంగా ఇరాన్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పోలీసు కస్టడీలో మహ్సా ఆమిని అనే 22ఏళ్ల యువతి మృతి తర్వాత పెద్ద ఎత్తున మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళన తెలుపుతున్నారు. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మహిళలైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడమే గాక, జుట్టును కత్తిరించుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా నడిచారు. ఆమె కూడా తన జుట్టును కట్ చేసుకొని ఆందోళన చేస్తున్న ఇరానీ మహిళలకు సంఘీభావం తెలిపారు.

ఈ విషయాన్ని ఊర్వశి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా పంచుకుంది. జుట్టును కత్తిరించుకుంటున్న ఓ ఫొటోను ఆమె షేర్ చేసింది. మహ్సా ఆమిని మృతికి నిరసన తెలుపుతున్న మహిళలందరికీ మద్దతు తెలుపుతున్నానని చెప్పింది. ఇదిలా ఉండగా మహ్సా  ఆమిని(22) అనే యువతి తన కుటుంబంతో కలిసి ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ పర్యటనకు వెళ్లింది.  మహిళలు తప్పనిసరిగా హిజాబ్ నిబంధనలు పాటించేలా పర్యవేక్షించే ఇరాన్ పోలీసులు.. మహ్సా ఆమిని హిజాబ్‌ ధరించకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను మూడు రోజుల పాటు కస్టడీలో ఉంచారు. పోలీసు కస్టడీలో ఉండగా ఆమిని అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. మూడు రోజుల తర్వాత కోమాలోకి వెళ్లింది. ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఆమె తలపై బలంగా కొట్టడం వల్లే చనిపోయిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ విషయంపై నిరసనలు వెల్లువెత్తాయి.