కోపెన్‌హెగెన్/వాషింగ్టన్: డెన్మార్క్ అధీనంలోని ఆటానమస్ ప్రాంతమైన గ్రీన్‌లాండ్ భద్రత కోసం అమెరికాతో ఒప్పందం ఖరారు అయినట్టు డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్సన్ ప్రకటించారు. వచ్చే వారం యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందన్నారు. గ్రీన్‌లాండ్‌లో భద్రతను బలోపేతం చేయడంపై డెన్మార్క్, గ్రీన్లాండ్లు అమెరికాతో కుదుర్చుకోనున్న ఈ ఒప్పందం నాటోకు, యూరప్‌కు మంచిదన్నారు.
ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో ఉమ్మడి భద్రతను ఈ ఒప్పందం బలోపేతం చేస్తుందన్నారు. ఈ ఒప్పందం అమల్లోకి రావడానికి అవసరమైన పార్లమెంటరీ ప్రక్రియల ద్వారా ముందుకెళ్లాల్సి ఉంటుందని ఫ్రెడరిక్సన్ ఆఫీస్ పేర్కొంది. గ్రీన్‌లాండ్ భద్రతపై అమెరికాకు నియంత్రణ కల్పించడానికి, అక్కడ శత్రుదేశాలు స్థావరాలు ఏర్పాటు చేయకుండా నిరోధించడానికి డెన్మార్క్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కాగా, ఈ ఒప్పందాన్ని గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్- ఫ్రెడరిక్ నీల్సన్ కూడా స్వాగతించారు.
