యూఎస్-–చైనా వాణిజ్య యుద్ధంతో భారత్కే లాభం.. ఎగుమతులు పెరిగే చాన్స్

యూఎస్-–చైనా వాణిజ్య యుద్ధంతో భారత్కే లాభం.. ఎగుమతులు పెరిగే చాన్స్

న్యూఢిల్లీ: యూఎస్,  చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య యుద్ధం వల్ల భారతీయ ఎగుమతిదారులకు మేలు జరుగుతుందని ట్రేడ్​ ఎక్స్​పర్టులు చెబుతున్నారు. వీళ్లు అమెరికా మార్కెట్​కు తమ సరుకు రవాణాను పెంచుకోవచ్చని అంటున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్​పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈఓ) అధ్యక్షుడు ఎస్ సీ రల్హన్ మాట్లాడుతూ, చైనాపై యూఎస్  అదనంగా 100 శాతం సుంకాలు విధించడం వల్ల డిమాండ్ భారత్ వైపు మళ్లుతుందని అన్నారు. 

2024–-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ యూఎస్​కు 86 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.  యూఎస్ వచ్చే నెల నుంచి చైనా వస్తువులపై అదనంగా 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చైనా దిగుమతులపై మొత్తం సుంకం రేటు దాదాపు 130 శాతానికి పెరిగింది.  అమెరికా రక్షణ, ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్-ఎనర్జీ పరిశ్రమలకు అత్యవసరం అయిన రేర్ ఎర్త్ ఎగుమతులపై కొత్త నియంత్రణలను చైనా ఈ నెల తొమ్మిదో తేదీన ప్రకటించింది. దానికి ప్రతిస్పందనగా యూఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారతీయ వస్తువులపై యూఎస్ సుంకాలు 50 శాతం ఉన్నాయి. 

ఇది చైనా వస్తువులపై ఉన్న 30 శాతం కంటే ఎక్కువ.  ఇప్పుడు చైనా వస్తువులపై ఈ 100 శాతం అదనపు సుంకం వేయడం వల్ల మన వాళ్లకు ప్రయోజనం ఉంటుందని ఒక టెక్స్​టైల్ ఎగుమతిదారు అన్నారు. చైనా నుంచి వచ్చే వస్తువుల ధరలు అమెరికా మార్కెట్లో పెరిగి, వాటి పోటీ సామర్థ్యాన్ని తగ్గిస్తాయని వివరించారు. బొమ్మల ఎగుమతిదారు మను గుప్తా కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. చైనా వస్తువులపై అధిక సుంకాలతో మన వస్తువులకు డిమాండ్​ పెరగవచ్చని చెప్పారు.   

సుంకం పెంపు సమాన అవకాశాలను ఇస్తుందని అన్నారు.  పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల వల్ల ప్రపంచ మార్కెట్లలో ఈవీలు, విండ్ టర్బైన్లు, సెమీకండక్టర్ భాగాల ధరలు అధికమవుతాయని థింక్​ట్యాక్​ జీటీఆర్​ఐ  తెలిపింది. ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, ఫుట్​వేర్​, వైట్ గూడ్స్, సోలార్ ప్యానెల్స్ కోసం అమెరికా ఎక్కువగా చైనాపై ఆధారపడుతోంది. 2024–-25 ఆర్థిక సంవత్సరంలో వరుసగా నాలుగో సంవత్సరం కూడా యూఎస్ భారత్​కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది.