న్యూయార్క్: ఇండియన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సుధా సుందరి నారాయణన్ కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా ప్రెసి డెంట్ డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ఆమె ఆదేశ సిటిజన్షిప్ తీసుకున్నారు. ‘నేచురలైజేషన్ సెరెమనీ’ పేరుతో వైట్ హౌజ్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆమె యూఎస్ సిటిజన్ గా ప్రమాణంచేశారు. సుధా సుందరితో పాటు బొలీవియా, లెబనాన్, సూడాన్, ఘనా దేశాలకు చెందిన నలుగురికి కూడా ఈ కార్యక్రమంలో సిటిజన్షిప్ దక్కింది. అనేక జాతులు, మతాలు, వర్ణాల ప్రజలతో కూడిన అమెరికా కుటుంబంలోకి ఈ ఐదుగురికీ ప్రెసిడెంట్ ట్రంప్ వెల్ కమ్ చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను రిపబ్లికన్ నేషనల్ కన్వెన్ష న్ రెండో రోజున మంగళవారం రాత్రి ప్లే చేశారు. ఈ ఐదుగురూ ఎడమ చేతిలో అమెరికా జెండాను పట్టుకుని, కుడి చేతిని పైకి ఎత్తి అమెరికా విధేయ పౌరులుగా ఉంటామని ప్రమాణం చేశారు.
సుధ అసాధారణ సక్సెస్ సాధించారు..
నేచురలైజేషన్ సెరెమనీ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఐదుగురు కొత్త, అద్భుతమైన వ్యక్తులు గ్రేట్ అమెరికన్ ఫ్యామిలీలోకి సభ్యులుగా రావడంపై సంతోషం వ్యక్తంచేశారు. ‘‘ఇప్పుడు మీరు మా సహచర అమెరికన్ పౌరులు. మీకు కంగ్రాట్స్. మీరు అమెరికన్ చట్టాలను, విలువలను ఫాలో అయ్యారు. ఈ రోజు మీరు ఇక్కడ ఉండటం మాకు గర్వకారణం. ప్రపంచంలోనే అతిగొప్ప గౌరవం, హక్కు అయిన అమెరికన్ సిటిజన్షిప్ ను మీరు సంపాదించారు’’ అని ట్రంప్ మెచ్చుకున్నారు. ఇండియాలో పుట్టి, 13 ఏళ్లక్రితం అమెరికా వచ్చిన సుధా నారాయణన్ అసాధారణ సక్సెస్ సాధించారని అన్నారు. సుధా ఒక టాలెంటెడ్ సాఫ్ట్ వేర్ డెవలపర్ అని అన్నారు. సుధ, ఆమె భర్త ఇద్దరు అద్భుతమైన పిల్లలను పెంచుతున్నారని, వారికి కంగ్రాట్స్ చెప్పారు.
