Trump Tariffs: ట్రంప్ సుంకాలకు అమెరికా కోర్ట్ బ్రేక్.. పరిధి దాటారంటూ మెుట్టికాయలు

Trump Tariffs: ట్రంప్ సుంకాలకు అమెరికా కోర్ట్ బ్రేక్.. పరిధి దాటారంటూ మెుట్టికాయలు

Court on Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో ప్రపంచ దేశాలపై భారీగా సుంకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చర్యలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలను భారీగా దెబ్బతీసిన సంగతి తెలిసిందే. చైనా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు దీనిని బాహాటంగానే వ్యతిరేకించగా.. మరికొన్ని దేశాలు ట్రంప్ ఆగ్రహానికి గురికాకుండా వాణిజ్య చర్చలు మెుదలుపెట్టిన సంగతి తెలిసిందే.

తాజాగా.. యూఎస్ ట్రేడ్ కోర్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ప్రకటించిన టారిఫ్స్ అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రెసిడెంట్ ఈ విషయంలో తన పరిధిని దాటి ప్రవర్తించినట్లు కోర్టు తన తీర్పులో పేర్కొంది. అమెరికాతో వాణిజ్యం చేస్తున్న దేశాల నుంచి దిగుమతులపై సుంకాలు విధించటాన్ని కోర్టు తప్పుపట్టింది. 

అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి అధ్యక్షుడి అత్యవసర అధికారాల ద్వారా అధిగమించబడని ఇతర దేశాలతో వాణిజ్యాన్ని నియంత్రించడానికి అమెరికా రాజ్యాంగం కాంగ్రెస్‌కు ప్రత్యేక అధికారాన్ని ఇస్తుందని అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం పేర్కొంది. ఈ క్రమంలో అధ్యక్షుడు దేశాలపై గంపగుత్తుగా ప్రకటించిన వాణిజ్య సుంకాలు అమలు కాకుండా ఉత్తర్వులు ఇస్తున్నట్లు ముగ్గురు సభ్యుల ధర్మాసనం వెల్లడించింది. ఫెడరల్ చట్టాలు సైతం ట్రంప్ చర్యలను అనుమతించవని, సుంకాల ప్రకటన తెలివైన నిర్ణయం కాదని కోర్టు పేర్కొంది. 

అలాగే గతంలో ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన సుంకాలను రద్దు చేస్తున్నట్లు రానున్న 10 రోజుల్లో కొత్త ఆర్డర్ విడుదల చేయాలని కూడా కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడిగా జనవరిలో ట్రంప్ బాధ్యతలు చేపట్టిననాటి నుంచి తీసుకుంటున్న అనేక సంచలన నిర్ణయాలపై అక్కడి కోర్టులు వరుస తీర్పులతో మెుట్టికాయలు వేస్తూనే ఉన్నాయి. అయితే ట్రంప్ మాత్రం తన పద్ధతి మార్చుకోకుండా అనుకున్నదే అమలు చేయాలని వరుస ఆర్డర్లు పాస్ చేస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా ట్రంప్ సుంకాలపై నమోదైన అనేక కేసులను పరిగణలోకి తీసుకున్న కోర్టు తాజా తీర్పు వెలువరించగా.. దీనిపై ట్రంప్ సర్కార్ అప్పీల్ చేస్తున్నట్లు నోటీసు దాఖలు చేసింది.