V6 News

బర్త్ టూరిజంపై అమెరికా కఠిన చర్యలు.. గర్భిణుల వీసా దరఖాస్తులపై మరింత నజర్.. డౌట్ వచ్చిందంటే తిరస్కరణే !

బర్త్ టూరిజంపై అమెరికా కఠిన చర్యలు.. గర్భిణుల వీసా దరఖాస్తులపై మరింత నజర్.. డౌట్ వచ్చిందంటే తిరస్కరణే !

వాషింగ్టన్: అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికా గడ్డపై జన్మించిన ఎవరికైనా ఆటోమేటిక్‌‌‌‌గా పౌరసత్వం లభిస్తుంది. ఈ నిబంధనను అవకాశంగా మలుచుకుని కొంతమంది గర్భిణిలు పిల్లలను కనేందుకే అమెరికా వస్తున్నారని ట్రంప్ సర్కారు ఆరోపించింది. పుట్టిన బిడ్డకు ఆటోమేటిక్ గా వచ్చే పౌరసత్వం ఆధారంగా వారు కూడా సిటిజెన్ షిప్ పొందుతున్నారని విమర్శించింది.

బర్త్  టూరిజంగా వ్యవహరించే ఈ విధానాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. అమెరికాలో బిడ్డకు జన్మనివ్వడం ద్వారా పౌరసత్వం పొందే ఆలోచన ఉందనే అనుమానం కలిగితే వీసా రిజెక్ట్ చేస్తామని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. అమెరికా వచ్చేందుకు దరఖాస్తుదారుడి ఉద్దేశం ఏంటనేది అధికారులు నిశితంగా పరిశీలిస్తారు. గర్భిణులు టూరిస్ట్ వీసా దరఖాస్తు చేస్తే అన్ని కోణాల్లో స్క్రూటినీ చేస్తారు.

‘బర్త్ టూరిజం’ అని అనుమానం వస్తే వీసా రిజెక్ట్  చేస్తారు. వీసా ఇంటర్వ్యూలలో వారికి ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. తమ ప్రయాణం కేవలం పర్యాటకం లేదంటే టెంపరరీ బిజినెస్ కోసమే తప్ప.. డెలివరీ చేసుకుని పౌరసత్వం పొందడానికి కాదని సదరు దరఖాస్తుదారు నిరూపించుకోవాలి. ఒకవేళ ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్​మెంట్ కోసం అమెరికా వెళ్లాల్సి వస్తే, ఆ విషయాన్ని ముందే స్పష్టంగా పేర్కొనాలి.

ట్రీట్​మెంట్​కు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించగలమని రుజువు చూపాలి. ఆ ఖర్చు అమెరికన్ పన్ను చెల్లింపుదారులపై పడకుండా చూసుకోవాలి. కాగా, బర్త్ టూరిజంలో ఎక్కువ శాతం రష్యన్లు, చైనీయులే ఉన్నారని, ఇటీవలి కాలంలో ఇండియన్లు కూడా ఈ విధానంలో అమెరికాకు వస్తున్నారని ఇమిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు.