వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదిరాయి. ఇరుదేశాల పరస్పర మిస్సైళ్ల దాడులతో పశ్చిమాసియా మళ్లీ అట్టుడుకుతోంది. గల్ఫ్ తీర ప్రాంతంలో అమెరికన్ నౌకాదళ యుద్ధనౌకను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇరాన్ దాడికి ప్రయత్నించింది. ఈ దాడికి ప్రతీకారంగా ఖార్గ్ ద్వీపం సమీపంలో ఐదు ఇరాన్ ముడి చమురు రవాణా నౌకలపై అమెరికా దాడి చేసి ధ్వంసం చేసింది.
ఈ దాడికి సంబంధించిన వీడియోలను యుఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) విడుదల చేసింది. యూఎస్ నేవీకి చెందిన యుద్ధ నౌకపై దాడికి ఇరాన్ చేసిన ప్రయత్నానికి ప్రతీకారంగా అమెరికా దళాలు ఈ దాడి చేసినట్లు స్పష్టం చేసింది. ఒమన్ గల్ఫ్‌లో ఇరాన్‌కు చెందిన ఎం/టి కవిజ్, ఎం/టి చార్మినార్, ఎం/టి హారిజన్ 1, ఎం/టి రీస్కో అనే నాలుగు ముడి చమురు రవాణా నౌకలు ధ్వంసమయ్యాయి.
ఖర్గ్ ద్వీపంలో మరో నౌకను దెబ్బతీసినట్లు వెల్లడించింది. దాడులకు ముందు ఐదు నౌకల సిబ్బందిని ఖాళీ చేయాలని అమెరికా దళాలు ప్రత్యక్ష ఆదేశాలు జారీ చేశాయని తెలిపింది. ఐఆర్జీసీ దాని ప్రాంతీయ ప్రాక్సీలకు నిధులు సమకూర్చే బహుళ బిలియన్ డాలర్ల రహస్య నెట్‌వర్క్‌లో భాగంగా ఇరాన్ ఈ ట్యాంకర్లను ఉపయోగించిందని అమెరికా ఆరోపించింది. ఆ నౌకలను రక్షించుకోవడానికి ఇరాన్‌కు ఎటువంటి మార్గాలు లేవని పేర్కొంది.
ఇరాన్ కౌంటర్ అటాక్:
తమ దేశానికి చెందిన ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా జరిపిన దాడులకు కౌంటర్‌గా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. యా హైదర్ కర్రార్ అనే పేరుతో ఆపరేషన్ చేపట్టిన ఇరాన్ బలగాలు జోర్డాన్‌లోని అమెరికా అల్-అజ్రాక్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడ్డాయి. అమెరికాకు చెందిన ఎఫ్-35, ఎఫ్-16, ఎఫ్-15 యుద్ధ విమానాలు ఉన్న విమాన హ్యాంగర్లు, షెల్టర్లను మిస్సైళ్లు ఢీకొట్టినట్లు ఇరాన్ తెలిపింది. ఏ మాత్రం తగ్గేది లేదని.. అమెరికా దాడులకు ధీటుగా ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ తేల్చిచెప్పింది.
