
భారతదేశంతో వాణిజ్య ఉద్రిక్తతలు సృష్టించటం, వాటిని బూతద్దంలో పెట్టి ప్రపంచానికి ఫేక్ ప్రచారం చేసేందుకు ట్రంప్ అండ్ టీమ్ తెగ ప్రయత్నిస్తున్నప్పటికీ అమెరికాలోని మాజీ అధికారులు, అడ్వైజర్ల నుంచి వ్యతిరేకత వినిపిస్తోంది. రష్యా ఆయిల్ కొనుగోళ్లను బూచిగా చూపించి ఇండియాను కార్నర్ చేయటం భారత వృద్ధిని అడ్డుకోవటానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను వారు వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ చెప్పిందల్లా వినటానికి మోడీ ఏం స్కూల్ పిల్లోడు కాదంటూ అమెరికా అధ్యక్షుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి.
ఈ క్రమంలోనే అమెరికా నేషనల్ సెక్యూరిటీ మాజీ అడ్వైజర్ జేక్ సుల్లివన్ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పాకిస్థాన్ లోని తమ ఫ్యామిలీ వ్యాపారాల కోసం ట్రంప్ భారతదేశంతో ఉన్న బంధాన్ని పక్కనపెడుతున్నారని సుల్లివన్ ఆరోపించారు. భారతదేశంతో సంబంధాలను దెబ్బతీసేందుకు ప్రస్తుత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న చర్యలను "ట్రంప్ విదేశాంగ విధానంలో అత్యంత తక్కువగా నివేదించబడిన అంశాల్లో ఒకటి"గా చెప్పారు. దశాబ్ధాలుగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌తో తన సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి అమెరికా కృషి చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
ALSO READ : ఆటో ట్రాన్స్‌షిప్‌మెంట్ కోసం ఫస్ట్ స్పెషల్ పోర్టు..
చైనా లాంటి దేశాలను ఎదుర్కోవటానికి భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవటం చాలా ముఖ్యమని సుల్లివన్ చెప్పారు. అయితే ట్రంప్ ఫ్యామిలీతో బిజినెస్ డీల్స్ చేసుకోవటానికి పాక్ ముందుకు రావటంతో ఇండియాను ప్రెసిడెంట్ పక్కనపెట్టారని చెప్పారు. భారతదేశంతో స్నేహాన్ని నాశనం చేయటం అమెరికాకు వ్యూహాత్మకంగా పెద్ద ఎదురుదెబ్బ అని సుల్లివన్ చెప్పారు. రష్యా నుంచి క్రూడ్ కొనుగోళ్లకు 25 శాతం అదనపు టారిఫ్స్ కలుపుకుని మెుత్తంగా 50 శాతం సుంకాలను ప్రకటించటం అస్సలు సరైన నిర్ణయం కాదని సుల్లివన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ట్రంప్ మెుదటి సారి అధ్యక్షుడు అయినప్పుడు.. అలాగే ఆ తర్వాత బైడెన్ వచ్చినప్పుడు కూడా పాక్ ను పక్కన పెట్టి చైనాను ఎదుర్కోవటానికి ఇండియాతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించారు. కానీ ట్రంప్ 2.0లో మాత్రం ట్రంప్ ఫ్యామిలీ పాకిస్థాన్ మధ్య క్రిప్టో డీల్స్ నుంచి ఇతర వ్యాపార ఒప్పందాలు కుదిరాయి. ఆ తర్వాతే పాక్ ఆర్మీ చీఫ్ రెండు సార్లు యూఎస్ టూర్లకు వెళ్లటం.. ఇండియా కంటే తక్కువగా పాక్ పై ట్రంప్ టారిఫ్స్ ప్రకటించటం వచ్చాయి. దీనికి తోడు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టగానే కొత్త విదేశీ రియల్టీ డీల్స్ సొమ్ము చేసుకోవటానికి కొత్త మార్గాలు తెరిచినట్లు ది న్యూయార్క్ టైమ్స్ నివేదించిన సంగతి తెలిసిందే.