
ఇరాక్‌పై మళ్లీ అమెరికా దాడి. బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై మిస్సైల్ ఎటాక్. ఢిల్లీ, లండన్‌లో దాడులకు ఖాసీం కుట్ర. యుద్ధాన్ని ఆపేందుకే అతడిని అంతం చేశామన్న ట్రంప్.
వాషింగ్టన్/న్యూఢిల్లీ/బాగ్దాద్: శనివారం ఉదయం ఇరాక్‌లో ప్రో–ఇరాన్ ఫైటర్లపై వైమానిక దాడులు జరిగాయి. హషద్ అల్ షాబీకి చెందిన నేతలను టార్గెట్ చేసుకుని ఈ ఎటాక్ జరిగింది. కాన్వాయ్‌పై జరిపిన మిసైల్ దాడిలో కొంత మంది చనిపోయారని, మరికొందరు గాయపడ్డారని పోలీసులు చెప్పారు. బాగ్దాద్‌కు ఉత్తర ప్రాంతంలో ఈ దాడి జరిగిందని తెలిపారు. అయితే ఎంత మంది చనిపోయారో అధికారికంగా వెల్లడించలేదు. ఈ దాడికి కారణం ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఇరాక్ మీడియా మాత్రం.. అమెరికా దళాలే దాడి చేశాయని ఆరోపించింది. దీనిపై అమెరికా ఎలాంటి స్పందన తెలపలేదు.
ఖాసింకు కన్నీటి వీడ్కోలు
జనరల్ ఖాసిం సులేమానీ సంతాపయాత్ర ఇరాక్ ప్రధాని ఆదిల్ అబ్దుల్ మహది, పొలిటికల్ లీడర్లు, మతాధిపతులు, వేలాది మంది ప్రజల మధ్య జరిగింది. మొదట ఆయన శవపేటికను ఉత్తర బాగ్దాద్ ఖాదిమియా జిల్లాలోని షియా మసీదుకు తీసుకెళ్లారు. ఆక్కడ సులేమానీకి వేలాది మంది కన్నీటి నివాళి అర్పించారు. ‘అమెరికాకు చావు తప్పదు’ అంటూ నినాదాలు చేశారు. నలుపు రంగు బట్టలు వేసుకున్న వారు తెల్లటి జెండాలు, ఇరానియన్, ఇరాకీ నాయకుల ఫొటోలను పట్టుకుని ‘ప్రతీకారం’ తీర్చుకోవాలంటూ కోపంగా అరిచారు. ఆ తర్వాత ఖాసిం మృతదేహాన్ని షియా పవిత్ర నగరమైన నజాఫ్‌కు తరలించనున్నారు. మిగతా రెవల్యూషనరీ గార్డుల మృతదేహాలను ఇరాన్‌కు పంపుతారు. ఖాసీం మృతికి ఇరాన్లో మూడు రోజులపాటు సంతాప దినాల్ని ప్రకటించారు.
ఇది ‘యాక్ట్ ఆఫ్ వార్’:యూఎన్‌లో ఇరాన్ అంబాసిడర్
తమ దేశం టాప్ కమాండర్‌ను చంపడం ‘యాక్ట్ ఆఫ్ వార్’ అని యునైటెడ్ నేషన్స్‌లో ఇరాన్ అంబాసిడర్ మాజిద్ తఖ్త్ రావంచి ఆరోపించారు. ‘‘మా టాప్ కమాండర్‌ను హత్య చేసి అమెరికా మిలటరీ వార్‌ను ప్రారంభించింది. ఇప్పుడు ఇరాన్ ఏం చేయాలి. ఇంత జరిగాక మేం సైలెంట్‌గా ఉండలేం. మేం స్పందించాలి. స్పందించి తీరుతాం. కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం. మిలటరీ యాక్షన్‌కు మిలటరీ యాక్షన్‌తోనే బదులిస్తాం. ఎవరు? ఎప్పుడు? ఎక్కడ? బదులిస్తారనేది భవిష్యత్‌లో తెలుస్తుంది” అని స్పష్టం చేశారు.
యూరప్ సాయపడ్తలేదు: అమెరికా
సులేమానీ హత్య విషయంలో తాము అనుకున్నంతగా యూరోపియన్ మిత్రపక్షాలు సహాయపడటం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. ‘‘ఈ రీజియన్‌లోని పార్ట్నర్లతో చర్చిస్తున్నాం. మేం ఏం చేశామో, ఎందుకు చేశామో వారికి వివరిస్తున్నాం. వారి సాయం కోరుతున్నాం. వాళ్లు కూడా సానుకూలంగా స్పందించి సాయపడుతున్నారు. ఇతర దేశాల్లోని భాగస్వాములతోనూ చర్చిస్తున్నాం. వారు కూడా బాగానే స్పందిస్తున్నారు. కానీ యూరోపియన్లు మాత్రం మేం అనుకున్నంతగా సాయపడటం లేదు” అని ఆరోపించారు. ‘‘మేం ఏం చేశామో బ్రిటిష్, ఫ్రెంచ్, జర్మన్లు అర్థం చేసుకోవాలి. యూరప్‌లోని ప్రజల ప్రాణాలను కూడా మేం కాపాడాం”
అని అన్నారు.