- అగ్నికీలల్లో ఆయిల్ డిపోలు
- ఇరాన్ చమురు నిల్వ కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు
- ఐదు ఆయిల్ స్టోరేజీ కేంద్రాలపై బాంబుల వర్షం
- టెహ్రాన్ వీధుల్లో ఎటుచూసినా మంటలే
- ఆకాశంలో వందల మీటర్ల వరకూ కమ్మిన పొగలు
- ఖుద్స్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ కూడా ధ్వంసం
- లెబనాన్‌పైనా ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
- తీవ్ర ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్
- బహ్రెయిన్‌లోని అమెరికా బేస్‌పై మిసైల్ అటాక్
- 21 మంది యూఎస్ సోల్జర్లు మృతి
- వాటర్ డీసాలినేషన్ ప్లాంట్‌పైనా డ్రోన్ దాడి
- ఇరాన్‌పై వారంలో 6,500 బాంబులు వేశాం: ఐడీఎఫ్
- ఇరాన్లో 2,400 దాటిన మరణాలు
టెహ్రాన్/జెరూసలెం/వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు తీవ్రమయ్యాయి. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఆదివారం తెల్లవారుజామున టెహ్రాన్ పరిసరాల్లోని 5 కీలక చమురు నిల్వ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో ఆయిల్ డిపోలు పేలిపోయి, అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. టెహ్రాన్ వీధులంతా ఎటుచూసినా మంటలు వ్యాపించాయి. సిటీపై ఆకాశంలో వందల మీటర్ల పొడవునా దట్టమైన నల్లని పొగలు కమ్మేయడంతో తెల్లవారినా సూర్యుడు కనిపించని భయానక పరిస్థితి నెలకొంది.
ఇరాన్ పై "మున్ముందు మరిన్ని సర్ ప్రైజింగ్ అటాక్స్ ఉంటాయి" అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరిగాయి. ఆయిల్ డిపోలపై జరిగిన దాడుల్లో నలుగురు ట్యాంకర్ డ్రైవర్లు చనిపోయారు. టెహ్రాన్ లోని ఖుద్స్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ను కూడా బాంబులతో పేల్చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. టెహ్రాన్‌తో పాటు అల్బ్ రోజ్, యాజ్ద్, ఇస్ఫహాన్ లోనూ ఇజ్రాయెల్, అమెరికా బలగాలు దాడులు చేశాయి.
అలాగే లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లపైనా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బీరుట్ లోని ఓ హోటల్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 12 మంది చనిపోయారు. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై, గల్ఫ్ దేశాల్లోని యూఎస్ బేస్ లపై భారీగా ప్రతీకార దాడులకు పాల్పడింది. బహ్రెయిన్ లోని వాటర్ డీసాలినేషన్ ప్లాంట్ పై డ్రోన్ అటాక్ చేసింది. ఇదే దేశంలోని యూఎస్ నేవీ బేస్ పైనా ఇరాన్ మిసైల్ దాడి చేయగా.. 21 మంది అమెరికన్ సోల్జర్లు చనిపోయారు. యూఏఈ, సౌదీపైనా ఇరాన్ తాజాగా డ్రోన్, మిసైల్ దాడులు చేసింది. సౌదీలో క్షిపణి శకలాలు తగిలి ఓ భారతీయుడు చనిపోయాడు. కాగా, ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 90 డాలర్ల మార్కును దాటింది.
21 మంది అమెరికన్ సోల్జర్లు మృతి..
బహ్రెయిన్ లోని జుఫైర్ జిల్లాలో ఉన్న అమెరికా నేవీ బేస్ పై ఇరాన్ ఆదివారం అటాక్ చేసింది. యూఎస్ నేవీకి చెందిన ఐదో ఫ్లీట్ పై జరిగిన ఈ దాడిలో 21 మంది అమెరికా సైనికులు చనిపోయారు. డ్రోన్లు, మిసైళ్లతో అత్యంత కచ్చితత్వంతో అమెరికా నేవీ స్థావరంపై దాడి చేశామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ) తెలిపింది. పర్షియన్ గల్ఫ్, రెడ్ సీ, అరేబియా సముద్రంవ్యాప్తంగా 2.5 మిలియన్ చదరపు మైళ్ల విస్తీర్ణాన్ని అమెరికా నేవీ ఐదో ఫ్లీట్ పర్యవేక్షిస్తున్నది.
ఇందులో భాగంగా అంతర్జాతీయ రవాణాలో కీలకంగా వ్యవహరించే హార్మూజ్ జలసంధిని కూడా మానిటర్ చేస్తున్నది. ఈ నౌకా స్థావరంలో 47 దేశాలకు చెందిన కంబైన్డ్ మారీటైమ్ బలగాల కూటమి, 8300 మంది నావికులు విధులు నిర్వహిస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో అత్యంత కీలకంగా ఉన్న ఈ స్థావరంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసి 21 మంది అమెరికన్ సైనికులను మట్టుబెట్టింది. ఇది అమెరికాకు అతిపెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
బహ్రెయిన్ డీసాలినేషన్ ప్లాంట్ ధ్వంసం
బహ్రెయిన్ లోని వాటర్ డీసాలినేషన్ ప్లాంట్ పైనా ఇరాన్ దాడి చేసింది. ఈ విషయాన్ని బహ్రెయిన్ అధికారులు తెలిపారు. ప్రజల కోసం వాడే ఇన్ ఫ్రాస్ట్రక్చర్లపై ఇరాన్ డ్రోన్ దాడి చేసిందని, ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ ఆదివారం ‘ఎక్స్’ లో తెలిపింది. ‘‘గల్ఫ్ దేశాల్లోని అమెరికా, ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలపైనే దాడి చేస్తామని ఇరాన్ చెప్పింది. కానీ, సివిల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పై దాడి చేసి తీవ్ర నష్టం కలిగించింది” అని పేర్కొంది.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకారదాడులు
ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా దాడులకు భీకరంగా ప్రతిదాడులు చేస్తున్నది. ఆదివారం గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రెయిన్ పై ఇరాన్ దాడులు చేసింది. తమ పొరుగు దేశాలపై దాడులు చేసినందుకు క్షమాపణ చెప్పిన ఇరాన్.. ఒక్కరోజులోనే మళ్లీ దాడులు ప్రారంభించింది. శనివారం రాత్రంతా ఆ దేశాలపై మిసైళ్ల వర్షం కురిపించింది. ఇరాన్ తమపై మిసైళ్లు, డ్రోన్లు ప్రయోగించిందని కువైట్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ దాడుల్లో పలువురు పౌరులు గాయపడగా.. పదుల సంఖ్యలో బిల్డింగులు డ్యామేజ్ అయ్యాయని వెల్లడించింది.
కువైట్ లోని సోషల్ సెక్యూరిటీ టవర్‌కు మంటలు అంటుకున్నాయని పేర్కొంది. ఆ టవర్ లో చాలా మంది చిక్కుకుపోయారని, వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నామని వివరించింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోని ఫ్యుయెల్ టాంకులపైనా ఇరాన్ డ్రోన్ అటాక్ చేసిందని ఆ దేశ మిలిటరీ తెలిపింది. అలాగే, దుబాయ్ పై 16 బాలిస్టిక్ మిసైళ్లు, 121 డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడింది. వాటిలో 15 మిసైళ్లు, 119 డ్రోన్లను కూల్చివేశామని దుబాయ్ ఆర్మీ వెల్లడించింది. ముఖ్యంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడి చేసిందని దుబాయ్ ఆర్మీ పేర్కొంది. కాగా..కువైట్ లోని అల్ అదిరి ఎయిర్ బేస్ తోపాటు అమెరికా హెలికాప్టర్ రిపేర్ సెంటర్లపై మిసైళ్లతో దాడి చేశామని ఐఆర్జీసీ తెలిపింది. ఒక డ్రోన్ దాడి కారణంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన ట్యాంకులు దెబ్బతిన్నాయి. ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించారు.
లెబనాన్ లో భూతల పోరు
లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా దళాలతో జరిగిన భీకర పోరాటంలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్ సైన్యంలో నమోదైన మొదటి మరణాలు ఇవే. బీరుట్‌లోని ఒక హోటల్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడిలో నలుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. కాగా, ఇరాన్ క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ వాణిజ్య రాజధాని టెల్ అవీవ్, జెరూసలెం ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ వీటిని అడ్డుకుంది.
ఇరాన్ లో 2,400 దాటిన మరణాలు
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ లో మరణాల సంఖ్య 2,400 దాటినట్టుగా మానవ హక్కుల సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇందులో మినాబ్ పాఠశాలపై జరిగిన దాడిలో మరణించిన 170 మంది విద్యార్థినులు కూడా ఉన్నారు. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 394 మంది మరణించగా, అందులో 83 మంది పిల్లలు ఉన్నారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇరాన్ క్షిపణి దాడుల వల్ల ఇజ్రాయెల్ లో ఇప్పటివరకు 14 మంది పౌరులు, సైనికులు మరణించారు. కువైట్ స్థావరంపై ఇరాన్ జరిపిన దాడుల్లో ఇదివరకే ఏడుగురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం బహ్రెయిన్ లోని అమెరికన్ బేస్ పై ఇరాన్ చేసిన దాడిలో ఏకంగా 21 మంది అమెరికన్ సోల్జర్లు మృతిచెందారు. దీంతో ఈ యుద్ధంలో చనిపోయిన అమెరికన్ సోల్జర్ల సంఖ్య 28కి పెరిగింది.
సౌదీలో క్షిపణి దాడి.. ఇండియన్ మృతి
సౌదీ అరేబియాలోని అల్-ఖర్జ్ నగరంలో జరిగిన క్షిపణి దాడిలో ఒక భారతీయుడితోపాటు బంగ్లాదేశ్ కు చెందిన మరో వ్యక్తి చనిపోయారు. అల్-ఖర్జ్ గవర్నరేట్‌లోని ఒక మెయింటెనెన్స్, క్లీనింగ్ కంపెనీకి చెందిన నివాస సముదాయంపై ఒక క్షిపణి వచ్చి పడటంతో ఈ ప్రమాదం జరిగినట్టు సౌదీ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. ఈ ఘటనలో మరో 12 మంది బంగ్లాదేశ్ పౌరులు తీవ్రంగా గాయపడ్డారని, వీరిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించామని తెలిపింది. సౌదీలో భారతీయుడు మరణించడంతో, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 24/7 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది.
ఇరాన్ దాడిని ఖండించిన జీసీసీ
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడిని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) తీవ్రంగా ఖండించింది. కువైట్, బహ్రెయిన్, దుబాయ్, ఖతార్ పై దాడిచేసి మొత్తం గల్ఫ్ ప్రాంత భద్రతను ఇరాన్ ప్రమాదంలో పడేసిందని జీసీసీ మండిపడింది. గల్ఫ్ దేశాలపై దాడి చేయబోమని ఇచ్చిన మాటను ఇరాన్ బ్రేక్ చేసిందని విమర్శించింది. .
కనీసం 6 నెలలు భీకరంగా పోరాడుతం: ఐఆర్ జీసీ
ఇరాన్ పై ఇజ్రాయెల్-అమెరికా చేస్తున్న దాడులకు తలొగ్గేది లేదని, ఆ రెండు దేశాలపై కనీసం 6 నెలలపాటు భీకరంగా పోరాడుతామని ఐఆర్జీసీ తెలిపింది. యుద్ధాన్ని 6 నెలలపాటు కొనసాగించే సత్తా తమ బలగాలకు ఉందని పేర్కొంది. బీరుట్లో చేసిన దాడికి కూడా ప్రతీకారం తీర్చుకుంటామని ఐఆర్ జీసీ ప్రతినిధి అలీ మొహమ్మద్ నైనీ ఒక ప్రకటనలో తెలిపారు.
వారంలో 6,500 బాంబులు వేశాం: ఐడీఎఫ్
ఈ యుద్ధంలో ఇప్పటివరకూ ఇరాన్ పై 6,500 బాంబులు వేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించింది. నిరుడు జూన్ లో 12 రోజుల్లో 4,500 బాంబులు వేయగా.. ఈసారి యుద్ధం ప్రారంభమైన వారం రోజుల్లో 6,500 బాంబులు వేసి వేశామని ఐడీఎఫ్ వెల్లడించింది. యూఎస్ ఎయిర్ ఫోర్స్ సాయంతో మొత్తం 3 వేలకుపైగా టార్గెట్లపై దాడులు చేశామని పేర్కొంది.
శనివారం రాత్రి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ) ఖుద్స్ ఫోర్స్ హెడ్‌క్వార్టర్స్‌ను ధ్వంసం చేశామని తెలిపింది. కాగా.. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు నిర్వహించడంలో ఖుద్స్ ఫోర్స్ కీలకంగా వ్యవహరించింది. హమాస్ టెర్రరిస్టులకు నిధులు సమకూర్చడం, లాజిస్టిక్ ఏర్పాటు చేయడం, శిక్షణ ఇవ్వడం వంటివి చేసింది. ఇరాన్ కు అంతటి కీలకంగా ఉన్న ఖుద్స్ ఫోర్స్ ను ధ్వంసం చేశామని, ఇది ఇరాన్ కు పెద్ద ఎదురుదెబ్బ అని ఐడీఎఫ్ పేర్కొంది.
ఇరాన్‌తో మొత్తం ప్రపంచానికి ముప్పు: నెతన్యాహు
తమ శత్రువు ఇరాన్ పై భీకర దాడులు చేసి ఆ దేశ గగనతలాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. అమెరికా సమన్వయంతో ఇరాన్ పై వ్యూహాత్మక దాడులు చేస్తున్నామని ఆయన చెప్పారు. శనివారం రాత్రి తన దేశ ప్రజలను ఉద్దేశించి నెతన్యాహు మాట్లాడారు. ఇరాన్ ఒక్క ఇజ్రాయెల్, అమెరికాకే కాకుండా యావత్ అంతర్జాతీయ సమాజానికీ ముప్పుగా మారిందన్నారు. ‘‘2023 అక్టోబర్ 7న మాపై హమాస్ టెర్రర్ దాడులు చేసిన రెండు తర్వాత మొత్తం పశ్చిమాసియాను మారుస్తానని నేను మాటిచ్చాను.
హమాస్ కు ఆశ్రయం కల్పించి ఇజ్రాయెల్ లో మారణకాండ సృష్టించిన మా శత్రువు ఇప్పుడు మా వ్యూహాలు, ఆశ్చర్యకరమైన దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు” అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. కాగా.. అమెరికా నుంచి ఇరాన్ కొనుగోలు చేసిన ఎఫ్14 ఫైటర్ జెట్లపైనా దాడి చేశామని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. సౌత్ టెహ్రాన్ లోని ఇస్ఫహాన్ ఎయిర్ పోర్టులో పార్క్ చేసిన ఆ ఫైటర్ జెట్లపై అటాక్ చేశామని, ఆ అటాక్ లో మొత్తం 7 ఫైటర్ జెట్లు ధ్వంసం అయ్యాయని వెల్లడించింది
