ఓడినా తీరు మార్చుకోని ట్రంప్.. ఎన్నికలకు ముందు చెప్పినట్లే ఇరాన్‎పై మెరుపు దాడి

ఓడినా తీరు మార్చుకోని ట్రంప్..  ఎన్నికలకు ముందు చెప్పినట్లే ఇరాన్‎పై మెరుపు దాడి

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇరాన్‎పై దాడులు చేస్తామని చెప్పినట్లుగానే చేశారు. శనివారం (నవంబర్ 6) అమెరికా దళాలు ఇరాన్‎పై విరుచుకుపడ్డాయి. హోర్ముజ్ జలసంధిలోని వ్యూహాత్మక కేశ్మ్ ద్వీపంలో కొత్తగా నిర్మించిన ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించాయి. డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులను ధృవీకరించారు. ఈ దాడిని ట్రంప్ మైనర్ స్ట్రైక్‎గా అభివర్ణించారు. కేశ్మ్ ద్వీపంలో ఇరాన్ నిర్మించిన యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ పరికరాన్ని అమెరికా సైన్యం కేవలం 15 నిమిషాల్లోనే విజయవంతంగా ధ్వంసం చేసిందని తెలిపారు. కేశ్మ్ ద్వీపంలోని సుజా ప్రాంతంలో రెండు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.

చెప్పిందే చేస్తోన్న ట్రంప్..!

2026, నవంబర్ 3న అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఘోర ఓటమి పాలైంది. అమెరికా కాంగ్రెస్‎లోని ఉభయ సభల్లో డెమోక్రాట్లు అధికారం చేజిక్కించుకున్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలు, ఆర్థిక భారంపై అమెరికా ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం రిపబ్లికన్ల ఓటమికి ప్రధాన కారణమైంది. మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైనప్పటికీ ఇరాన్ విషయంలో తన వైఖరి మార్చుకోవడం లేదు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఇరాన్‎పై మళ్లీ దాడులను మొదలుపెట్టింది. 

అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇరాన్‎పై జరిగిన తొలి దాడి ఇదే. ఎన్నికల్లో ఓడినప్పటికీ ట్రంప్ మాత్రం తన తీరు మార్చుకోలేదు. ఒకవైపు.. దాదాపు ఎనిమిది నెలలుగా సాగుతోన్న అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు ఖతార్, ఒమన్ దేశాల చేసిన మధ్యవర్తిత్వ ప్రతిపాదనలను ఇరాన్ పరిశీలిస్తుండగానే అమెరికా దాడులకు పాల్పడటం గమనార్హం. అమెరికా చర్యలపై ఇరాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలీ. అమెరికా దాడులకు ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగితే పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారనుంది.