
న్యూయార్క్: ఈ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌కు తెరలేచింది. సోమవారం మొదలయ్యే ఈ మెగా టోర్నీకి మరో విశేషం ఉంది. సొంత గడ్డపై జరిగే ఈ టోర్నీతో అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ తన సుదీర్ఘ, అత్యంత విజయవంతమైన కెరీర్‌కు వీడ్కోలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ తరంలో గ్రేటెస్ట్ టెన్నిస్ ప్లేయర్‌గా కితాబు అందుకున్న 40 ఏండ్ల సెరెనా ఓపెన్ ఎరాలో రికార్డు స్థాయిలో 23 గ్రాండ్‌స్లామ్స్ సొంతం చేసుకుంది. మరొక్కటి సాధిస్తే టెన్నిస్ హిస్టరీలో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ప్లేయర్‌గా ఆస్ట్రేలియా లెజెండ్ మార్గరేట్ కోర్ట్ రికార్డును సమం చేస్తుంది. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తన చివరి గ్రాండ్‌స్లామ్ నెగ్గిన విలియమ్స్ గాయాలు, ఫామ్ కోల్పోయి ఐదేళ్లుగా ఇబ్బంది పడుతోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో తను యూఎస్ ఓపెన్ నెగ్గి 24 మేజర్ టైటిళ్లతో వీడ్కోలు పలికితే అంతకుమించిన ఫేర్‌వెల్ మరొకటి ఉండదు. మంగళవారం తెల్లవారుజామున జరిగే తొలి రౌండ్‌లో డాంక కొవినిచ్ (మాంటినెగ్రో)తో తలపడనున్న సెరెనా.. విమెన్స్ డబుల్స్‌లో తన అక్క వీనస్ విలియమ్స్‌తో కలిసి బరిలో నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ టాప్ సీడ్ ఇగా స్వైటెక్(పోలెండ్), రెండో సీడ్ కొంటావీట్ (యిస్తోనియా), మరియా సకారి (గ్రీస్), సిమోనా హలెప్ (రొమేనియా) , నవోమి ఒసాకా (జపాన్)ఫేవరెట్లుగా కనిపిస్తున్నారు.
కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా సెర్బియా లెజెండ్ నొవాక్ జొకోవిచ్ ఈ టోర్నీకి దూరం అవ్వడంతో మెన్స్ సింగిల్స్‌లో మరో మేజర్ టైటిల్‌తో తన రికార్డును మెరుగు పరుచుకునేందుకు స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్‌కు చాన్స్ లభిస్తోంది. గత ఫ్రెంచ్ ఓపెన్‌తో 22వ గ్రాండ్‌స్లామ్ సొంతం చేసుకున్న నడాల్ రెండో సీడ్‌గా బరిలో నిలిచాడు. డిఫెండింగ్ చాంప్ టాప్ సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా), సిట్సిపాస్ (గ్రీస్) కూడా ఫేవరెట్లుగా కనిపిస్తున్నారు.