నేను బాగున్నా.. ర్యాలీలకు రెడీ

నేను బాగున్నా.. ర్యాలీలకు రెడీ

న్యూయార్క్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎలక్షన్ ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. శనివారం రాత్రి ర్యాలీకి రెడీగా ఉన్నట్లు గురువారం ‘ఫాక్స్ బిజినెస్’ చానెల్ కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. అయితే.. ఆ ఇంటర్వ్యూలో ట్రంప్ మళ్లీ మళ్లీ దగ్గుతూనే.. మాట్లాడారు. దీంతో ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటూ.. ఇంటర్వ్యూ చేస్తున్న సియాన్ హానిటీ అడిగారు. తాను బాగానే ఉన్నానని ట్రంప్ చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ 25 నిమిషాల పాటు అనేక విషయాలపై మాట్లాడారు. డెమొక్రటిక్ పార్టీ క్యాండిడేట్లు జో బిడెన్, కమలా హారిస్ లపైనా తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. డెమొక్రటిక్ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కమలా హారిస్ ఒక భూతమని, కమ్యూనిస్టు, అబద్ధాల కోరు అని ట్రంప్ విమర్శించారు. ఆమెను ఎవరూ ఇష్టపడరని చెప్పారు. జో బిడెన్ ప్రెసిడెంట్ అయితే..  నెలరోజుల్లోనే ఆమె ప్రెసిడెంట్ పదవిని టేకోవర్ చేస్తుందన్నారు.  దేశంలోకి కిల్లర్లు, మర్డరర్లు, రేపిస్టులు వెల్లువెత్తేలా బార్డర్లు తెరవాలని ఆమె కోరుకుంటున్నారని చెప్పారు. ట్రంప్ మాటలు ఆయన ద్వేషాన్ని చాటుతున్నాయని, ఆయన స్ట్రాంగ్ గా ఉండే మహిళలను ఎదుర్కోలేరని బిడెన్ తిప్పికొట్టారు.

డిబేట్లపై సందిగ్ధం.. 

అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో క్యాండిడేట్లు ట్రంప్, బిడెన్ ల మధ్య ఇప్పటికే ఫస్ట్ డిబేట్ ముగిసింది. ఈ నెల 15న రెండో డిబేట్, 22న ఫైనల్ డిబేట్ జరగాల్సి ఉంది. అయితే ట్రంప్ కు కరోనా సోకినందున వర్చువల్ డిబేట్లు నిర్వహించాలని ప్రెసిడెన్షియల్ డిబేట్స్ కమిషన్ ప్రతిపాదించింది. దీనికి ట్రంప్ గురువారం నిరాకరించారు. కంప్యూటర్ ముందు కూర్చుని వాదించుకోవడం హాస్యాస్పదంగా ఉంటుందన్నారు. అందుకే సెకండ్ డిబేట్ ను ఈ నెల 22కు, ఫైనల్ డిబేట్ ను 29కి వాయిదా వేయాలన్నారు. అయితే సెకండ్ డిబేట్ ను ఈ నెల 15న వర్చువల్ గా నిర్వహించేందుకు లేదా దానిని 22కు మార్చేందుకు కూడా బిడెన్ ఒప్పుకొన్నారు. కానీ ఫైనల్ డిబేట్ ను 29కి వాయిదా వేయడాన్ని మాత్రం ఒప్పుకోమన్నారు. దీంతో మిగతా రెండు ప్రెసిడెన్షియల్ డిబేట్ల సంగతి ప్రశ్నార్థకంగా మారింది.