బ్రెజిల్‌పై డొనాల్డ్ ట్రంప్ 50% సుంకం.. ఆగస్టు 1 నుంచి అమలులోకి..

బ్రెజిల్‌పై డొనాల్డ్ ట్రంప్ 50% సుంకం.. ఆగస్టు 1 నుంచి అమలులోకి..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రెజిల్ వస్తువులపై ఏకంగా 50 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ట్రంప్ బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు మద్దతుగా నిలిచారు. ఆయనపై కొనసాగుతున్న అవినీతి కేసు అవమానకరం అంటూ విమర్శించారు. ప్రస్తుత ఉన్న అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులాకు రాసిన లేఖలో మాజీ అధ్యక్షుడిపై కొనసాగుతున్న కేసును నిలిపివేయాలని ట్రంప్ కోరటం గమనార్హం.

బ్రెజిల్ వాణిజ్య విధానాలపై అమెరికా దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా ఈ క్రమంలో ట్రంప్ హెచ్చరించారు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడితో తనకు మంచి పరిచయం ఉందన్న ట్రంప్ ప్రపంచ దేశాలు ఆయనను గౌరవంగా చూశాయన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న బ్రెజిల్ అధ్యక్షుడు లూలా నుంచి బోల్సోనారో అధికారం చేజిక్కించుకునేందుకు కుట్ర పన్నారని, అయితే ఆ దేశ సైన్యం నుంచి మద్దతు రాకపోవటం వల్ల అది విఫలం అయ్యిందనే వాదనలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బ్రెజిల్ మాజీ నాయకుడు ప్రస్తుతం 2022 అధ్యక్ష ఎన్నికలను తారుమారు చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

అయితే ట్రంప్ తాజాగా ప్రకటించిన 50 శాతం వాణిజ్య సుంకంపై బ్రెజిల్ కూడా స్పందించింది. అమెరికా చర్యలపై.. ఉపాధ్యక్షుడు, ఆర్థిక మంత్రితో సహా ఉన్నతాధికారులతో బ్రెసిలియాలో అర్థరాత్రి అత్యవసర సమావేశం నిర్వహించినట్లు అధ్యక్షుడు లూలా వెల్లడించారు. బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ అందకారంలో ఉన్న సమయంలో ట్రంప్ దూకుడుగా టారిఫ్స్ ప్రకటించారు. అయితే ట్రంప్ చర్యలకు అనుగుణంగా తాము కూడా ముందుకెళ్లాల్సి ఉంటుందని లూలా ఈ సందర్భంగా హెచ్చరించారు. అయితే ఆగస్టు 1 నాటికి ఎలాంటి కార్యాచరణతో ముందుకొస్తారనే విషయం వేచి చూడాల్సిందే.