- వంద రోజులకు చేరిన అమెరికా– ఇరాన్ వార్
- ప్రపంచానికి మేలు చేసేందుకే ఈ యుద్ధం..
- విదేశాల్లోని ఇరాన్ ఆస్తులను రిలీజ్ చేయబోం
- ఆర్థిక ఆంక్షలనూ ఇప్పట్లో ఎత్తివేయబోమన్న ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ తో ప్రస్తుతం జరుగుతున్న శాంతి చర్చలు ఓ కొలిక్కి రాకుంటే ఆ దేశం మళ్లీ రాతియుగానికి వెళుతుందంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. శాంతి ఒప్పందంపై సంతకాలు చేయకుంటే ఇరాన్ ను సమూలంగా పేల్చివేస్తామని చెప్పారు. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఆదివారంతో వందో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పలు కీలక కామెంట్లు చేశారు. ఇరాన్ తో పాటు ఆ దేశ పాలకులను ఉద్దేశించి ‘వాళ్లు పిచ్చోళ్లు’ అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు.
ఓ శక్తిమంతమైన, అత్యంత ప్రమాదకరమైన దేశాన్ని తాను అణ్వాయుధ దేశంగా మారకుండా అడ్డుకుంటున్నానని, ప్రపంచానికి మేలు చేసేందుకే ఈ యుద్ధం చేస్తున్నానని ట్రంప్ చెప్పారు. ఇరాన్ మాత్రం కాలయాపన చేస్తూ మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. శాంతి చర్చలు సానుకూలంగానే జరుగుతున్నాయని, ఇరు దేశాలు ఒక ఒప్పందానికి ‘చాలా దగ్గరగా’ వచ్చాయని ట్రంప్ వెల్లడించారు.
తాము విధించిన నిబంధనల ప్రకారం అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా ఉండేందుకు ఇరాన్ అంగీకరించిందని చెప్పారు. అయితే, దీంతో పాటు అణ్వాయుధాలను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని తాను పట్టుబడుతున్నట్లు ట్రంప్ వివరించారు. దీనికి తొలుత కాస్త వ్యతిరేకించినప్పటికీ ఇరాన్ చివరికి అంగీకరించిందని ఆయన వెల్లడించారు.
- హార్మూజ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి ప్రాంతంలో అంతర్జాతీయ రవాణా నౌకలను బెదిరిస్తున్న ఇరాన్‌కు చెందిన రెండు డ్రోన్లను అమెరికా సైన్యం (సెంట్ కామ్) ఆదివారం కూల్చివేసింది. అంతకుముందు కూడా ఇరాన్‌కు చెందిన 4 డ్రోన్లను, తీరప్రాంత రాడార్ కేంద్రాలను అమెరికా దళాలు ధ్వంసం చేశాయి. ఇరాన్ వైఖరి కారణంగా హార్మూజ్ మూతపడటంతో గల్ఫ్ దేశాల నుంచి చమురు, గ్యాస్ రవాణా నిలిచిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి.
- పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు
ఈ సుదీర్ఘ గల్ఫ్ సంక్షోభాన్ని ముగించడానికి పాకిస్తాన్, ఖతార్ వంటి దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ స్వయంగా టెహ్రాన్‌లో పర్యటించి చర్చల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇరాన్ అంతర్గతంగా బలంగానే ఉందని, యుద్ధాన్ని కొనసాగించే సామర్థ్యం దానికి ఇంకా ఉందని ట్రంప్ అంగీకరించడం గమనార్హం. ఒకవేళ ఈ చర్చలు ఫలించకపోతే మాత్రం అమెరికా సైనిక చర్య తీవ్ర రూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది.
- ఆస్తులను విడుదల చేయబోమని వెల్లడి
శాంతి ఒప్పందం కుదరడానికి ముందే అమెరికా వద్ద నిలిచిపోయిన ఇరాన్ దేశానికి చెందిన నిధులను లేదా ఆస్తులను విడుదల చేసే ప్రసక్తి లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఆర్థిక ఆంక్షలను కూడా ఇప్పుడే ఎత్తివేయబోమన్నారు. ‘ముందు ఒప్పందం జరగాలి, ఆ తర్వాతే మిగతావన్నీ. వారు బుద్ధిగా ఉండి, మంచిగా ప్రవర్తిస్తేనే నిధుల విడుదలపై ఆలోచిస్తాం’ అని ట్రంప్ స్పష్టం చేశారు. లీగ్ ఆఫ్ లెబనాన్‌ను ఈ స్వల్పకాలిక ఒప్పందంలో భాగం చేయాలని తాము డిమాండ్ చేయడం లేదన్నారు.
