
హమాస్ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌లో బుధవారం (అక్టోబర్ 18న) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటించనున్నారు. బుధవారం అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్నారని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం ఇప్పటికే ప్రకటించింది. ఇజ్రాయెల్ పర్యటన అనంతరం బైడెన్.. జోర్డాన్ వెళ్తాడని, అక్కడ ఈజిప్ట్, పాలస్తీనా, జోర్డాన్ దేశాధినేతలతో ఆయన సమావేశం అవుతారని వైట్‌హౌస్ తెలిపింది.
హమాస్ మిలిటెంట్ల తీవ్రవాద దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌కు తన బలమైన మద్దతును ప్రదర్శించడమే ఆ దేశంలో బైడెన్ పర్యటన ప్రధాన ఉద్దేశమని వైట్‌హౌస్ వర్గాలు చెప్పాయి. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా ఇజ్రాయెల్‌తో చర్చించనున్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్ టూర్ అనంతరం జోర్డాన్ రాజధాని అమ్మన్‌కు బైడెన్ వెళ్తారని తెలిపింది. అక్కడ జోర్డాన్ రాజు అబ్దుల్లా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతే అల్- సిసీ, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో సమావేశమవుతారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
గాజాకు మానవతా సాయంపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో జో బైడెన్ చర్చలు జరుపుతారని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. గాజాకు సహాయం చేసే విషయంలో ప్రణాళికను రూపొందించడానికి ఇరు దేశాలు అంగీకరించినట్లు చెప్పారు. గాజాలోని పౌరులకు మానవతా సహాయం అందించే విధంగా తన కార్యకలాపాలను నిర్వహించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
హమాస్ ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా నిలుస్తామని జో బైడెన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. మానవతా సాయం అందించే విషయంపై అధికారులతో చర్చిస్తామన్నారు.