ఉక్రెయిన్కు నో.. దక్షిణ కొరియాకు యస్

ఉక్రెయిన్కు నో.. దక్షిణ కొరియాకు యస్
  • రెండు మిత్రదేశాలకు ఫైటర్​ జెట్స్​ ఇచ్చే విషయంపై అమెరికా తీరొక్క ప్రకటనలు

వాషింగ్టన్/సియోల్​: యుద్ధ విమానాలు కావాలని అడిగిన ఉక్రెయిన్, దక్షిణ కొరియాలకు అమెరికా ఒకేరోజులో తీరొక్క ఆన్సర్​ చెప్పింది. ఉత్తర కొరియా నుంచి అణ్వాయుధ ముప్పును ఎదుర్కొంటున్న దక్షిణ కొరియాకు ‘యస్’​ చెప్పిన అగ్రరాజ్యం.. రష్యాతో యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్​ కు మాత్రం ‘నో’ చెప్పింది. ఈ రెండు ప్రకటనలు కూడా మంగళవారం రోజు కొన్ని గంటల తేడాతో వెలువడ్డాయి. గగనతలంలో రష్యాను తిప్పికొట్టేందుకు తమకు ఎఫ్–16 ఫైటర్​ జెట్స్​ కావాలంటూ ఉక్రెయిన్​ చేసిన రిక్వెస్ట్​ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ తిరస్కరించారు. ఆ విమానాలు అందించలేమని స్పష్టం చేశారు. అనంతరం బైడెన్​ నిర్ణయాన్ని సమర్ధిస్తూ అమెరికా జాతీయ భద్రతా మండలి కోఆర్డినేటర్​ (స్ట్రాటజిక్​ కమ్యూనికేషన్స్​) జాన్​ కిర్బీ ఓ ప్రకటన విడుదల చేశారు. రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్​ కు రూ.2 లక్షల కోట్లు విలువైన సైనిక సహాయాన్ని అందించామని గుర్తు చేశారు. బ్రాడ్లీ ఫైటింగ్​ వెహికిల్స్​ రకానికి చెందిన యుద్ధ ట్యాంకుల షిప్​మెంట్​ గతవారమే అమెరికా నుంచి ఉక్రెయిన్​ కు బయలుదేరిందని చెప్పారు. అయితే ఉక్రెయిన్​ కు యుద్ధ విమానాల సరఫరాపై జర్మనీ నో చెప్పిన మరుసటిరోజే.. అమెరికా కూడా అదేవిధమైన ప్రకటన చేసింది. రష్యా మండిపాటు వల్లే ఇవి యుద్ధ విమానాలను ఉక్రెయిన్​కు ఇవ్వడం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

ఉత్తర కొరియాకు కళ్లెం వేసేందుకు..

దక్షిణ కొరియాలో అత్యాధునిక ఆయుధాల మోహరింపును మరింత పెంచుతామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్​ఆస్టిన్​ ప్రకటించారు. ఉత్తరకొరియా నుంచి అణ్వాయుధ ముప్పు పెరిగిన నేపథ్యంలో దక్షిణ కొరియాకు సైనికంగా అండగా నిలబడతామన్నారు. ఇందులో భాగంగా అత్యాధునిక ఎఫ్–22, ఎఫ్​–35 వంటి ఫైటర్​ జెట్స్ తో సంయుక్త సైనిక విన్యాసాలను కొనసాగిస్తామని తెలిపారు. దక్షిణ కొరియా రక్షణమంత్రి లీ జాంగ్​ సుప్​ తో  కలిసి మంగళవారం సియోల్​ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈవివరాలను వెల్లడించారు.  

పుతిన్​తో టచ్​లో ఉన్నా: జర్మనీ చాన్స్​లర్

ఉక్రెయిన్​ కు యుద్ధ ట్యాంకులను పంపుతామని వారం కిందట జర్మనీ, అమెరికా, పలు యూరప్​ దేశాలు ప్రకటన చేయగానే రష్యా మండిపడింది. నాటో దేశాల జోక్యాన్ని సహించబోమని, ఇలాంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. దీంతో వెంటనే జర్మనీ చాన్స్​లర్​ ఓలఫ్​ షోల్జ్​ మాట మార్చారు. ఉక్రెయిన్​కు ఫైటర్స్​ జెట్స్​ ఇవ్వబోమని సోమవారం చెప్పారు. నాటో దేశాలు, రష్యా మధ్య యుద్ధం రాబోదని.. టెన్షన్లు పెరిగేందుకు చాన్స్​ ఇవ్వబోమని వెల్లడించారు. “నేను పుతిన్​తో టచ్​లో ఉన్నాను. డిసెంబరు మొదటి వారంలోనే ఫోన్​లో ఆయనతో మాట్లాడాను. మరోసారి ఫోన్​లో మాట్లాడతాను” అని జర్మనీ చాన్స్​లర్​ చెప్పారు.