ఉత్తర కొరియాలో అమెరికా సీక్రెట్ ఆపరేషన్.. 2019లో ట్రంప్ హయాంలో చేపట్టినట్టు న్యూయార్క్ టైమ్స్ కథనం

ఉత్తర కొరియాలో అమెరికా సీక్రెట్ ఆపరేషన్.. 2019లో ట్రంప్ హయాంలో చేపట్టినట్టు న్యూయార్క్ టైమ్స్ కథనం
  • ఆ దేశ తీరంలో నిఘా పరికరం ఏర్పాటుకు ప్లాన్ 
  • ఆ ప్లాన్ బెడిసికొట్టినట్టు వెల్లడి 

న్యూఢిల్లీ: అమెరికా గతంలో ఉత్తర కొరియాలో ఓ ఆపరేషన్ చేపట్టిందని, అయితే అది విఫలమైందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘‘ఉత్తర కొరియాలో నిఘా పరికరం అమర్చేందుకు గతంలో అమెరికా ఓ ఆపరేషన్‌ చేపట్టింది. దీన్ని అత్యంత రహస్య ఆపరేషన్లు నిర్వహించే నేవీ సీల్‌ బృందం చేపట్టింది. కానీ ఆ సమయంలో కమాండోలు జరిపిన కాల్పుల్లో పలువురు ఉత్తర కొరియా పౌరులు చనిపోయారు. దీంతో ఈ ఆపరేషన్‌ను అమెరికా వెంటనే నిలిపివేసింది” అని ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ పేర్కొంది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను మీడియా ప్రశ్నించగా.. ఆ విషయాలేవీ తనకు తెలియవని సమాధానం దాటవేశారు. 

 అసలేంటీ మిషన్?  

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు సంబంధించిన ప్రైవేట్‌ కమ్యూనికేషన్‌ను నిరోధించే ఓ ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని ఆ దేశంలో అమర్చాలని అమెరికా భావించింది. తద్వారా ఉత్తర కొరియా సీక్రెట్ సమాచారాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి మిషన్లు చేపట్టాలంటే అధ్యక్షుడి ఆమోదం తప్పనిసరి. ఆనాడు (2019) అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్‌.. ఈ టాప్‌ -సీక్రెట్‌ నేవీ సీల్‌ ఆపరేషన్‌కు ఆమోదం తెలిపారని సమాచారం. ఈ మిషన్‌కు సంబంధించి 25 మందికి పైగా అధికారులు, సైనిక సిబ్బందిని ఇంటర్వ్యూ చేసినట్టు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ తన కథనంలో పేర్కొంది. 

రెడ్ స్క్వాడ్రన్‌కు అప్పగింత..  

ట్రంప్‌ అధికారం చేపట్టిన తర్వాత అమెరికా, -ఉత్తర కొరియా మధ్య 2018లో దౌత్య చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆ దేశంలో నిఘా పరికరాన్ని అమర్చాలని అమెరికా ప్రణాళిక రచించింది. ఇందుకోసం అణు సామర్థ్యం కలిగిన జలాంతర్గామిని ఉత్తర కొరియా తీరానికి పంపించి.. అక్కడి నుంచి రెండు మినీ సబ్‌మెరైన్ల ద్వారా ఒడ్డుకు చేరుకొని నిఘా పరికరాన్ని అమర్చాలనేది ప్లాన్‌. ఒసామా బిన్‌ లాడెన్‌ను మట్టుబెట్టిన ‘రెడ్‌ స్క్వాడ్రన్‌’ యూనిట్‌లోని సీల్‌ బృందానికి వైట్‌హౌస్ ఈ పని అప్పగించింది. ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్లను చేపట్టేందుకు రెడ్‌ స్క్వాడ్రన్‌ను 1980లో అమెరికా ఏర్పాటు చేసింది. 

ఇట్ల ఫెయిలైంది.. 

ఈ ఆపరేషన్‌ కోసం సీల్ యూనిట్ కమాండోలు కొన్ని నెలల పాటు రిహార్సల్స్‌ చేశారు. అయితే ఉత్తర కొరియాలో సరిహద్దు ఆంక్షల కారణంగా డ్రోన్లు, ఇతర టెక్నాలజీని వినియోగించే అవకాశం లేకపోవడం వాళ్లకు సవాలుగా మారింది. కేవలం శాటిలైట్‌ ఇమేజ్‌లపైనే ఆధారపడాల్సి రావడంతో రియల్‌ టైమ్‌ సమాచారం దొరికేది కాదు. అయినప్పటికీ ఆపరేషన్‌ చేపట్టాలని సీల్‌ భావించింది. వియత్నాంలో (2019) కిమ్‌తో ట్రంప్‌ భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే.. ఓ రోజు రాత్రి సీల్‌ తన ఆపరేషన్‌ మొదలుపెట్టింది. కమాండోలు బ్లాక్ సూట్‌లు, నైట్‌-విజన్‌ అద్దాలు, నిఘాకు చిక్కని ఆయుధాలు ధరించి తీరానికి చేరుకున్నారు. 

అయితే అక్కడ నిఘా పరికరాన్ని అమర్చే క్రమంలో వాళ్లకు ఊహించని పరిణామం ఎదురైంది. ఉత్తర కొరియాకు చెందిన ఓ చిన్న బోటు వాళ్లకు సమీపంలోకి వచ్చింది. తమవైపు ఫ్లాష్‌లైట్‌లు వేయడంతో ముప్పు ఎదురైందని గ్రహించిన సీల్‌ బృందం.. బోటులో ఉన్న వారిపై కాల్పులు జరిపింది. దీంతో బోటులో ఉన్న వాళ్లు చనిపోయారు. వెంటనే అప్రమత్తమైన సీల్‌ కమాండోలు.. నిఘా పరికరాన్ని అమర్చకుండానే తిరిగి వచ్చేశారు. అలా అమెరికా ఆపరేషన్ విఫలమైందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. 

2005లో కోవర్ట్‌ ఆపరేషన్.. 

2005లో జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ సీల్ యూనిట్ ఉత్తర కొరియాలో కోవర్టు ఆపరేషన్‌ చేపట్టిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి బహిరంగ సమాచారం లేదు. కానీ 2019 ఆపరేషన్‌ గురించి ట్రంప్‌ యంత్రాంగం అమెరికా కాంగ్రెస్‌లోని కీలక సభ్యులకూ తెలియజేయలేదని, ఇది ఆందోళనకర విషయమని తన కథనంలో న్యూయార్క్ టైమ్స్‌ పేర్కొంది.