ఉద్రిక్తతలను వెంటనే తగ్గించండి..జైశంకర్‌‌, షెహబాజ్ షరీఫ్‌‌లకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ 

ఉద్రిక్తతలను వెంటనే తగ్గించండి..జైశంకర్‌‌, షెహబాజ్ షరీఫ్‌‌లకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ 
  • శాంతి చర్చలకు తమ మద్దతు ఉంటుందని వెల్లడి

న్యూఢిల్లీ: భారత్, -పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌‌లతో ఫోన్‌‌లో మాట్లాడారు. ఉద్రిక్తతను వెంటనే తగ్గించుకోవాలని..దక్షిణాసియాలో శాంతి, భద్రతలను కాపాడాలని ఇరు దేశాలకు సూచించారు. జైశంకర్‌‌తో రూబియో మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేశారు.

ఉగ్రవాదంపై పోరులో భారత్‌‌కు సహకరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అదే సమయంలో భారత్.. పాకిస్తాన్‌‌తో ఉద్రిక్తతలను తగ్గించాలని, శాంతిని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. ఈ సంభాషణ తర్వాత జైశంకర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. "పహల్గాం ఉగ్రదాడి గురించి యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోతో చర్చించాను. పహల్గాం దాడి నేరస్థులు, మద్దతుదారులు, ప్రణాళికకర్తలకు తగిన శిక్షపడాలి" అని పేర్కొన్నారు.

పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌‌తోనూ రూబియో మాట్లాడారు. పహల్గాం దాడిని ఖండించాలని సూచించారు. ఈ దాడిపై జరిపే విచారణకు పాకిస్తాన్ సహకరించాలని కోరారు. ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ అందించే ఏ మద్దతునైనా నిలిపివేయాలన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ప్రత్యక్ష శాంతి చర్చలకు అమెరికా మద్దతు ఉంటుందని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య కమ్యూనికేషన్లను మెరుగుపరచడానికి జరిగే ప్రయత్నాలను ప్రోత్సహిస్తామని మార్కో రూబియో పేర్కొన్నారు.