
- ఆస్పత్రిలో చేరిన మరో పాతిక మంది
- న్యూఆర్లియన్స్ దగ్గర్లో ఘటన
- పొగమంచు కమ్మేయడమే కారణం
- కిలోమీటర్ల కొద్దీ నిలిచిన వాహనాలు
వాషింగ్టన్: అమెరికాలోని న్యూఆర్లియన్స్ దగ్గర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైవేను పొగమంచు కమ్మేయడంతో వేగంగా దూసుకెళుతున్న వాహనాలు వరుసగా ఒకదానినొకటి ఢీ కొన్నాయి. మొత్తంగా 158 కార్లు ప్రమాదానికి గురయ్యాయి. మంటలు ఎగిసిపడి పలు వాహనాలు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. మరో పాతిక మందికి గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలిసి రెస్క్యూ టీంలు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయాలపాలైన వారిని అంబులెన్స్ లలో ఆసుపత్రికి తరలించారు. మరికొంతమంది వాహనదారులకూ గాయాలయ్యాయని, వారు సొంతంగా చికిత్స చేయించుకుంటామని వెళ్లిపోయారని అధికారులు తెలిపారు.
కాగా, దట్టమైన పొగమంచు, కార్చిచ్చుల వల్ల ఎగిసిపడే పొగ కలిసినపుడు ఏర్పడే సూపర్ ఫాగ్ హైవేను కమ్మేసిందని అధికారులు తెలిపారు. పొగమంచు దట్టంగా ఉండడంతో మూడు మీటర్లకు మించి కనిపించలేదని, రోడ్డు సాఫీగా ఉందని వేగంగా దూసుకెళ్లిన వాహనాలు ప్రమాదానికి గురయ్యాయని వివరించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను లూసియానా పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైవేపై రెండు వైపులా పలు వాహనాలు కాలి బూడిదైన స్థితిలో కనిపించాయి.