వాషింగ్టన్: అమెరికాలోకి దిగుమయ్యే వస్తువులపై తాను విధించిన టారిఫ్లతో ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తం సమకూరనుందని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. త్వరలోనే 60 వేల కోట్ల డాలర్ల (రూ.54 లక్షల కోట్లు) ఆదాయం రానుందని వెల్లడించారు. తన పాలసీలతో దేశం ఆర్థికంగా, జాతీయ భద్రతా పరంగా గతంలో ఎన్నడూలేనంతగా బలోపేతం అవుతోందని చెప్పారు. ఈమేరకు ఆయన తన ‘ట్రూత్ సోషల్’లో ఓ పోస్ట్ పెట్టారు.
‘‘అమెరికాకు త్వరలోనే 600 బిలియన్ డాలర్లకుపైగా ఆదాయం టారిఫ్ల రూపంలో వస్తోంది. కానీ ఫేక్ న్యూస్ మీడియా మాత్రం ఈ విషయాన్ని చెప్పదు. ఎందుకంటే వారికి ఈ దేశం అంటే గౌరవం లేదు. నేను తీసుకున్న టారిఫ్ నిర్ణయంపై త్వరలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్నందున.. ఆ తీర్పు నాకు వ్యతిరేకంగా రావాలని కొన్ని మీడియా సంస్థలు కోరుకుంటున్నాయి” అని ఆయన ఆరోపించారు.
కాగా, ట్రంప్ గత ఏడాది జనవరిలో రెండో సారి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత అమెరికాలోకి వచ్చే ప్రపంచ దేశాల వస్తువులపై వివిధ కారణాలు చూపుతూ భారీగా టారిఫ్లు విధించారు. ఇండియాపై సైతం 50శాతం వరకూ టారిఫ్లు విధించారు.
అయితే, అమెరికా టారిఫ్ ల నేపథ్యంలో ఇండియా తన వస్తువులకు ఇతర దేశాల్లోని మార్కెట్ల వైపు దృష్టి సారిస్తోందని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ ఇటీవల ఓ కథనంలో పేర్కొంది.
