తాలిబన్ల నుంచి కాపాడండి: అఫ్గాన్‌లో చిక్కుకున్న మహిళ ఏడుస్తూ రిక్వెస్ట్

V6 Velugu Posted on Aug 22, 2021

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల కదలికలు అక్కడి జనాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఏ క్షణంలో ఎవడొచ్చి తుపాకీ గురి పెడతాడో అని భయంతో చచ్చి బతుకుతున్నారు. అఫ్గాన్‌ను చెరబట్టిన తాలిబన్లు విదేశీయులు, ఇన్నేండ్లుగా అమెరికా బలగాలకు, అఫ్గాన్ సైన్యానికి సహకారం ఇచ్చిన వాళ్ల కోసం అడుగడుగునా గాలిస్తున్నారు. ఎవరు చిక్కినా నిర్దాక్షిణ్యంగా చంపేసేందుకు ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఆ నరకం నుంచి బయటపడాలంటే మిగిలి ఉన్న అంతో ఇంతో సేఫ్ ప్లేస్ కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్టు మాత్రమే. అక్కడికి చేరుకునే ప్రయత్నంలో తాలిబన్ల కంట పడకుండా వెళ్లడానికి నానా తంటాలు పడుతున్నారు. 

ఇలాంటి కష్టాలనే ఎదుర్కొంటున్న ఓ అమెరికన్ మహిళ అక్కడి దీనస్థితిని తెలియజేస్తూ తమను కాపాడాలని వేడుకుంటూ ఒక ఆడియోను రికార్డ్ చేసి పంపింది. ఈ ఆడియోను అమెరికాలోని వెస్ట్ వర్జీనియా నుంచి కాంగ్రెస్‌కు ఎన్నికైన సభ్యురాలు కరోల్ మిల్లర్ ట్వీట్ చేశారు. ‘‘అఫ్గాన్‌లో చిక్కుకున్న ఒక అమెరికన్ మహిళ నుంచి ఈ ఆడియో వచ్చింది. ఆమె కాబూల్ ఎయిర్‌‌పోర్టుకు చేరుకునే క్రమంలో తాలిబన్లు దాడి చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. అమెరికాతో పాటు మన మిత్ర దేశాలకు చెందిన వారిని అక్కడి నుంచే సేఫ్‌గా రక్షించుకోవాలి” అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఈ ఆడియో పంపిన మహిళకు సంబంధించి మరిన్ని వివరాలను అంతర్జాతీయ మీడియా ప్రచురించింది. ఆమె కాబూల్ ఎయిర్‌‌పోర్టుకు వెళ్లే దారిలో ఒక్క చోట తాలిబన్లకు చిక్కారని, ఆ సమయంలో ఆమెను కొరడాలతో కొట్టారని ఫాక్స్‌ న్యూస్ పేర్కొంది. ఆమె పక్కనే ఉన్న ఒక వ్యక్తిని కాల్చి చంపారని, అక్కడి నుంచి పారిపోయి కొందరు బిక్కుబిక్కుమంటూ దాక్కొని ఉన్నారని, అందులో ఈ అమెరికన్ మహిళ కూడా ఉందని తెలిపింది. కాబూల్ ఎయిర్‌‌పోర్టుకు వెళ్లే దారిలో తాలిబన్లు సుమారు 20 చోట్ల చెక్‌పోస్టులు పెట్టారని, తాము రోడ్డుకు సమీపంలోనే దాక్కుని ఉన్నామని, అటువైపుగా ఏ వెహికల్ వెళ్లినా ఎక్కడ తాలిబన్లు వచ్చి చంపేస్తారోనని భయంతో వణికిపోతున్నామని ఆమె పేర్కొందని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. అఫ్గాన్‌లో పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, నాటో, అమెరికా సేనలకు సాయపడిన వాళ్లను, అమెరికన్లను చంపేందుకు తాలిబన్లు ఇండ్లు గాలిస్తూ తిరగుతున్నారని పేర్కొంది. తాలిబన్ల భయంతో కాబూల్ ఎయిర్‌‌పోర్టుకు వెళ్లలేకపోతున్నానని, బతికి బయటపడి మళ్లీ అమెరికాలో ఉన్న బిడ్డలను చూస్తానో లేదోనని భయంగా ఉందని, తమను రక్షించాలని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్‌ను ఆమె వేడుకుంటోందని తెలిపింది.

Tagged Biden, Taliban, US woman, Afghan

Latest Videos

Subscribe Now

More News