ఈవీలు, సోలార్ పవర్ వినియోగం పెరగాలి: వరల్డ్‌‌‌‌ స్టాండర్డ్స్‌‌‌‌ డే–2026 సదస్సులో మంత్రి వివేక్‌‌‌‌

ఈవీలు, సోలార్ పవర్ వినియోగం పెరగాలి: వరల్డ్‌‌‌‌ స్టాండర్డ్స్‌‌‌‌ డే–2026 సదస్సులో మంత్రి వివేక్‌‌‌‌
  • భవిష్యత్తులో బొగ్గు లభ్యత తగ్గే ప్రమాదం ఉంది
  • టామ్‌‌‌‌కామ్‌‌‌‌ శిక్షణ, నియామకాలకు బీఐఎస్‌‌‌‌ ధ్రువీకరణ తేవాలి  
  • వరల్డ్‌‌‌‌ స్టాండర్డ్స్‌‌‌‌ డే–2026 సదస్సులో మంత్రి వివేక్‌‌‌‌

హైదరాబాద్​, వెలుగు: భవిష్యత్తులో బొగ్గు లభ్యత తగ్గే ప్రమాదం ఉందని, ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్​వాహనాలు(ఈవీలు), సౌర విద్యుత్‌‌‌‌, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలని రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్‌‌‌‌ వివేక్‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. 

హైదరాబాద్‌‌‌‌లోని ది మనోహర్‌‌‌‌ హోటల్‌‌‌‌లో బ్యూరో ఆఫ్‌‌‌‌ ఇండియన్‌‌‌‌ స్టాండర్డ్స్‌‌‌‌(బీఐఎస్‌‌‌‌) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వరల్డ్‌‌‌‌ స్టాండర్డ్స్‌‌‌‌ డే–2026 సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యం–7కు అనుగుణంగా అందరికీ అందుబాటు ధరలో నాణ్యమైన, స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు.

స్వచ్ఛ ఇంధన పరిష్కారాలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీలేని నాణ్యత, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని పరిశ్రమలు, తయారీదారులకు సూచించారు. పర్యావరణహిత సాంకేతికతలను ప్రోత్సహించేందుకు పరిశ్రమలు, ప్రభుత్వాలు, విద్యాసంస్థలు మునుపెన్నడూ లేని విధంగా ఒకే తాటిపైకి వచ్చి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.  పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాల భవనాల పైకప్పులపై సోలార్‌‌‌‌ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సాధారణ ప్రజలు సైతం తమ ఇళ్లలో, తోటల్లోనూ సంప్రదాయ విద్యుత్‌‌‌‌కు బదులుగా సోలార్‌‌‌‌ దీపాలను వాడేలా చర్యలు తీసుకోవాలన్నారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
మార్కెట్లోకి వచ్చే ప్రత్యామ్నాయ ఇంధన పరికరాలు ప్రజలకు చౌకగా లభించడంతోపాటు బీఐఎస్ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను విధిగా పాటించాలని మంత్రి వివేక్​వెంకటస్వామి సూచించారు. ఆయన వైద్య వృత్తిని వీడి పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో విశాఖ ఇండస్ట్రీస్‌‌‌‌ స్థాపన సమయంలో బీఐఎస్‌‌‌‌ ధ్రువీకరణ పొందిన అనుభవాలను సభలో పంచుకున్నారు.

మార్కెట్లోకి వస్తువులను విడుదల చేసే ముందే బీఐఎస్‌‌‌‌ నిర్దేశించిన అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, కఠిన నిబంధనలు సంస్థ క్రమశిక్షణకు, ఎదుగుదలకు ఎంతగానో ఉపపయోగపడ్డాయని తెలిపారు. కర్మాగారాలను ఏర్పాటు చేసిన ప్రతిసారీ తప్పనిసరిగా ధ్రువీకరణ పొందడం వల్లే అన్ని యూనిట్లలో ఏకరూప నాణ్యతను సాధించగలిగామని చెప్పారు. ఉత్పత్తుల నాణ్యతతోపాటు కార్మికుల ప్రాణ రక్షణ, భద్రతకు పరిశ్రమలు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  

యువత ఉపాధికి పెద్ద పీట
టామ్‌‌‌‌కామ్‌‌‌‌తో  రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి తెలిపారు.

విదేశీ పరిశ్రమల ఆధునిక సాంకేతిక అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు ప్రత్యేక వృత్తి నైపుణ్యాలు, అంతర్జాతీయ భాషా శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. టామ్‌‌‌‌కామ్‌‌‌‌ అందించే శిక్షణ, విదేశీ రిక్రూట్‌‌‌‌మెంట్ ప్రక్రియలకు ప్రత్యేకంగా బీఐఎస్‌‌‌‌ ధ్రువీకరణను తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వ నియామక సంస్థకు బీఐఎస్‌‌‌‌ గుర్తింపు లభిస్తే అంతర్జాతీయ స్థాయిలో దాని విశ్వసనీయత పెరిగి, మన యువతకు గ్లోబల్ మార్కెట్లో ఉన్నత అవకాశాలు లభిస్తాయని చెప్పారు. బీఐఎస్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌ డైరెక్టర్లు శ్రీకాంత్‌‌‌‌, సవిత పారిశ్రామిక నాణ్యతా ప్రమాణాల ప్రాధాన్యతను వివరించారు.