పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) . 'గబ్బర్ సింగ్' వంటి హిట్ మూవీ తర్వాత దాదాపు దశాబ్ద కాలం గ్యాప్‌లో వస్తున్న వీరిద్దరి కలయికపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ తన షూటింగ్ ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. మేకర్స్ లేటెస్ట్ గా ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రైవేట్ కాలేజీ వేదికగా యువత సమక్షంలో తొలి గీతాన్ని విడుదల చేశారు.
తొలి గీతం లాంచ్.. ఆరంభమే అదిరింది!
'దేఖ్ లేంగే సాలా' అంటూ సాగే ఈ తొలి లిరికల్ వీడియో సాంగ్ ఇప్పుడు నెట్టింట్లో సునామీ సృష్టిస్తోంది. ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ (DSP) కంపోజ్ చేశారు. గతంలో 'గబ్బర్ సింగ్' సినిమాకు డీఎస్పీ ఇచ్చిన మ్యూజిక్ ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ పాట బీట్ ప్రేక్షకులను ఊపేస్తున్నా, 'ఎక్కడో విన్నామే' అనే ఫీలింగ్ కూడా కలిగిస్తోందని అభిమానులు చర్చించుకుంటున్నారు. భాస్కర భట్ల అందించిన పదునైన సాహిత్యం, విశాల్ దద్లానీ , హరిప్రియ ఆలపించిన శక్తివంతమైన గానం ఈ పాటకు ప్రధాన బలం నిలిచింది.
లక్ష మందితో లిరిక్ షీట్ లాంచ్!
నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచడానికి ఒక సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. లక్ష మందికి పైగా అభిమానుల ఎంట్రీస్‌తో కూడిన ఒక ట్రివియా ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాతే 'దేఖ్ లేంగే సాలా' పాట యొక్క అధికారిక లిరిక్ షీట్‌ను విడుదల చేయడం జరిగింది. ఈ వినూత్న ప్రయోగం సినిమాపై అభిమానులకు ఉన్న మక్కువను మరో సారి నిరూపించింది.
పవన్ స్టైల్ డ్యాన్స్.. శ్రీలీల గ్లామర్
ఈ పాటలో పవన్ కల్యాణ్ వేసిన "రంపంపం రంపంపం స్టెప్పేస్తే భూకంపం" డ్యాన్స్ మూమెంట్స్, ఆయన స్టైలిష్ మ్యానరిజం వెండితెరపై అభిమానులకు ఫుల్ కిక్ ఇవ్వనున్నాయని విజువల్స్ స్పష్టం చేస్తున్నాయి. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పూర్తి స్థాయి డ్యాన్స్‌ను సిల్వర్ స్క్రీన్ పై చూడబోతున్నందుకు ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీలీల (Sreeleela) ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా, మరో నాయిక రాశీ ఖన్నా (Raashi Khanna) కీలక పాత్ర పోషిస్తోంది. వీరిద్దరి గ్లామర్ సినిమాకు మరింత కలర్ తీసుకురానుందంటున్నారు అభిమానులు.
గ్లింప్స్ డైలాగ్స్ తో అంచనాలు పీక్స్‌కి
ఇప్పటికే విడుదలైన 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్ డైలాగ్‌లు అంచనాలను పతాక స్థాయికి చేర్చాయి. "భగత్... భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది"... అంటూ తనదైన మ్యానరిజంతో పవన్ చెప్పే డైలాగ్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. నిర్మాతగా మైత్రీ మూవీ మేకర్స్ వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్, మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు . ఇది 'గబ్బర్ సింగ్' రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

