GHMCలో ఒక్కశాతం ఇండ్లు ఇచ్చినట్టు నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటం

GHMCలో ఒక్కశాతం ఇండ్లు ఇచ్చినట్టు నిరూపిస్తే  ఎన్నికల నుంచి తప్పుకుంటం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ , గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 24 లోగా ఈ మూడు కార్పొ రేషన్లలో పార్టీ డివిజన్ కమిటీలు పూర్తి చేయాలని నేతలకు ఆయన ఆదేశించారు. ఆదివారం ఇంది రాభవన్లో ఉత్తమ్ అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం మూడు గంటలపాటు జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంట్రాకర్ట్ల నుంచి దోచుకున్న కోట్లాది రూపాయలతో టీఆర్ ఎస్ నేతలు ఎన్నికల బరిలో దిగుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో అభివృద్ధి అంత కాంగ్రెస్ హయాంలో జరిగిందని, టీఆర్ ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధిలేదన్నారు. ‘‘టీఆర్ఎస్  ప్రభుత్వం జీహెచ్ఎంసీలో ఒక్క శాతం ప్రజలకైనా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు. ఇలా ఇచ్చినట్లు నిరూపిస్తే మేం ఎన్నికల నుంచి తప్పుకుంటం” అని ఆయన సవాల్ విసిరారు.

కేటీఆర్ కు హైదరాబాద్ అభి వృద్ధి, బస్తీ దవఖాన్లు ఇప్పుడు గుర్తుకు వచ్చాయని విమర్శించారు. ఎన్నికల్లో ఇంటింటికి తిరిగి టీఆర్ ఎస్ ఫెయిల్యూర్స్ ను  వివరిస్తామని చెప్పారు. ఉస్మాని యా హాస్పిటల్ కోసం ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, నిజాం కట్టిన భవనాన్ని కూల్చేస్తాం అంటున్నారని మండిపడ్డారు. మూడు కార్పొరేషన్లలో తాము గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘‘హైదరాబాద్ డివిజన్ల డీలి మిటేషన్ లో అక్రమాలు జరిగాయి. కొంతమందికి ప్రయోజనం చేకూరేలా చర్యలు ఉన్నాయి. కొన్ని డివిజన్లలో తక్కువ ఓట్లు, కొన్ని వార్డుల్లో ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ఓటర్ లిస్ట్ల విషయంలో అలర్ట్ గా ఉండాలని లోకల్ లీడర్స్ ను  కోరుతున్నా. ఈ నెల 24 లోగా మూడు కార్పొరేషన్లలో డివిజన్ కమిటీలు పూర్తి చేయాలి. అనుబంధ సంఘాలకు కూడా కమిటీలు వేయాలి” అని ఆదేశించారు.

 సర్కార్ పై క్రిమినల్ కేసు పెట్టాలి: రేవంత్

సెక్రటేరియట్ లోని గుడి, మసీదు కూల్చివేత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పై క్రిమినల్ కేసు నమోదయ్యేలా ఉత్తమ్, భట్టి బాధ్యత తీసుకోవాలని ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన కాంగ్రెస్ ను కాదని ఎంఐఎంకు ఆ హోదా ఇచ్చారని, ఎంఐఎం పూర్తిగా టీఆర్ఎస్ కనుసన్నల్లోనే నడుస్తోందని మండిపడ్డారు. సెక్రటేరియట్లోని మసీదు, గుడి కూల్చివేత అంశంలో బీజేపీ, ఎంఐఎం కూడా దోషులేనని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న పురాతన ఆల యాలపై తన మార్క్ వేసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఏపీకి రాజధాని లేనట్లే తెలంగాణకు సెక్రటేరియట్ లేకుండా పోయిందని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో సీరియస్ గా పనిచేయాలని, మీటింగ్ లకే పరిమితమైతే లాభం లేదని నేతలకు రేవంత్ సూచించారు. సెక్రటేరియట్ లోని మసీదు, గుడి కూల్చివేత అంశాన్ని ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.